రియల్ వెర్రి..!
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:06 AM
ఫామ్‌ల్యాండ్ వెంచర్ల పేరిట కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త దందాకు తెరలేపారు. వందల ఎకరాల్లో ఫామ్‌ల్యాండ్ వెంచర్లు వేసి.. గుంట, రెండు గుంటల చొప్పున ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ప్రత్యేకించి నగరాల్లో ఉద్యోగం చేసుకుంటూ, ‘రైతు’ను అనిపించుకోవాలనే కోరిక ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఫామ్‌ల్యాండ్ వెంచర్ల పేరిట రియల్టర్ల దందా
గుంట, రెండు గుంటల చొప్పున ప్లాట్ల విక్రయాలు
గుట్టలు, రాళ్లు రప్పలకు హంగులు అద్ది అమ్మకాలు
పెద్దసంఖ్యలో కొనుగోలు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్, ప్రైవేట్ ఉద్యోగులు
తహసీల్దార్ కార్యాలయాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు
రైతుహోదా.. రైతుభరోసా.. రైతుబీమాకు అర్హత
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో వేలాది ఎకరాల్లో వెంచర్లు
ఆరేళ్లలో 35 వేల మందికి పైగా కొత్త రైతుల నమోదు
అక్రమ రిజిస్ట్రేషన్లు, రైతుబీమా ప్రీమియంతో సర్కారుకు రూ.వందల కోట్లలో నష్టం
సంగారెడ్డి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఫామ్‌ల్యాండ్ వెంచర్ల పేరిట కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త దందాకు తెరలేపారు. వందల ఎకరాల్లో ఫామ్‌ల్యాండ్ వెంచర్లు వేసి.. గుంట, రెండు గుంటల చొప్పున ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ప్రత్యేకించి నగరాల్లో ఉద్యోగం చేసుకుంటూ, ‘రైతు’ను అనిపించుకోవాలనే కోరిక ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. గుంట వ్యవసాయ భూమి ఉన్నా ప్రభుత్వం రైతుగా గుర్తింపునిస్తుందని చెబుతూ ఎమోషనల్‌గా ఎర వేస్తున్నారు. ‘రైతు హోదా’ పొందడం ద్వారా రైతు భరోసా వస్తుందని, రైతుబీమాకు అర్హులవుతారని, బ్యాంకుల్లో రైతు కోటాలో రుణాలు తీసుకోవచ్చని, ప్రభుత్వం రైతులకు ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలను పొందవచ్చని చెబుతున్నారు.
దీంతో వారు ఫామ్‌ల్యాండ్ వెంచర్లలో పెద్ద సంఖ్యలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో ఈ దందా పెద్ద ఎత్తున సాగుతోంది. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్‌గిద్ద, కంగ్టి, మానూరు, సిర్గాపూర్ మండలాల్లో 3వేల ఎకరాలకు పైగా ఈ ఫామ్‌ల్యాండ్ వెంచర్లు వేశారు. కొండలు, గుట్టల్లో రాళ్లు, రప్పలను కూడా వెంచర్లుగా చేసి అమ్మేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్, ప్రైవేట్ ఉద్యోగులు భారీగా వీటిని కొనుగోలు చేశారు. దీంతో గడచిన ఆరేళ్ల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో 35 వేల మందికి పైగా కొత్త రైతులు పుట్టుకొచ్చారు.
గజం భూమి ధరకు గుంట భూమి వస్తుందని..
హైదరాబాద్‌లో గజం భూమి ధర తక్కువలో తక్కువగా రూ.లక్ష పలుకుతోంది. అటు ఇటుగా అదే ధరకు ఫామ్‌ల్యాండ్‌లో గుంట భూమి వస్తుందని, పైగా రైతు హోదా దక్కుతుండడంతోపాటు రైతుబీమా కూడా వర్తిస్తుందని చెబుతూ రియల్టర్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో రైతుగా నమోదైన వ్యక్తి ఏ కారణంతోనైనా చనిపోతే.. రైతుబీమా పథకం కింద ప్రభుత్వం అతని కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్మును అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణాలతో హైదరాబాద్ నగరానికి చెందినవారు ఈ భూమి పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రతి ఆదివారం దాదాపు వెయ్యి కార్లలో నారాయణఖేడ్ ప్రాంతానికి కస్టమర్లను రియల్టర్లు తమ సొంత ఖర్చులతో తీసుకువస్తున్నారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫామ్‌ల్యాండ్ వెంచర్‌ను చూపించి.. లేనిపోని మాటలన్నీ చెప్పి ప్లాట్లను విక్రయిస్తున్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు వీటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో నగర ప్రజలనే టార్గెట్ చేసుకున్నారు. అయితే.. సాధారణంగా ప్లాట్లు విక్రయించాలంటే భూమిని ముందుగా వ్యవసాయేతర భూమిగా మార్చాలి. నాలా అనుమతి తీసుకున్నాకే అక్కడ రోడ్లు, వసతులు కల్పించాలి. వీటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ, ఫామ్‌ల్యాండ్ వెంచర్లకు ఎలాంటి నాలా అనుమతులు లేవు. దీంతో వీటిని నేరుగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాస్తవానికి కనీసం 5 గుంటల భూమి అయితేనే తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధనలున్నాయి. గుంట, రెండు గుంటలు అయితే.. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుందని సీనియర్ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఉదాహరణకు.. ఒకరి భూమి పక్కన బాట కోసం గుంట లెక్కన కొనుగోలు చేయడం, తండ్రికి 2గుంటల వ్యవసాయ భూమి ఉంటే తన ఇద్దరు వారసులకు చెరో గుంట రిజిస్ట్రేషన్ చేసేసందర్భాల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. వీటిని కూడా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పరిశీలన చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ, ఇక్కడ మాత్రం ఇందుకువిరుద్ధంగా గుంట, రెండు గుంటలు కొనుగోలు చేసిన వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఫామ్‌ల్యాండ్ వెంచర్లు నిర్వహిస్తున్న వారంతా బడా రియల్టర్లే కావడంతో వందల ఎకరాల్లో భూమిని కొనుగోలు చేసి.. వాటిని విక్రయించే దాకా స్థానికులను, ప్రజాప్రతినిధులను, అధికారులను తమ కనుసన్నల్లో పెట్టుకుంటున్నారు. ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ముందుగానే ఒప్పందం చేసుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో తక్కువ చార్జీతో రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. ఉదాహరణకు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండలాల్లో సగటున ఒక గుంట స్థలాన్ని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తే రూ.22 వేల ఖర్చవుతుంది. అదే తహసీల్దార్ కార్యాలయంలో గుంట భూమి రిజిస్ట్రేషన్‌కు రూ.3 వేలకు మించడం లేదు. ఇలా గుంట భూమికే ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.20 వేల నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన నేపథ్యంలో సర్కారుకు రావాల్సిన ఆదాయానికి రూ.వందల కోట్లలో గండి పడింది. దీంతోపాటు రైతుబీమా కోసం ప్రభుత్వం ప్రతి రైతు పేరిట ఏటా రూ.3500 బీమా కంపెనీకి చెల్లిస్తోంది. ప్రభుత్వానికి ఇలా నష్టం వాటిల్లుతుంటే.. రియల్టర్లు మాత్రం భారీగా ఆదాయం కొల్లగొడుతున్నారు. రూ.5 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేసి.. దానికి ఫామ్‌ల్యాండ్ వెంచర్ హంగులు కల్పించి.. ఒక ఎకరం మీదనే దాదాపు రూ.50 లక్షలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ వెంచర్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై తగిన చర్యలు తీసుకుంటే ఖజానాకు గండిపడకుండా చూడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయాధికారులకు తలనొప్పిగా..
ఫామ్‌ల్యాండ్ వెంచర్ల వ్యవహారం వ్యవసాయాధికారులకు తలనొప్పిగా మారింది. ఇటీవల ఫార్మర్ రిజిస్ర్టీని రైతు వారీగా రికార్డు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 4,66,850 మంది రైతులకుగాను 2,77,929 మంది రైతులే తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకుంటే వీరికి ఐడీ క్రియేట్ అవుతుంది. దీని ద్వారానే పంటల సాగు, యూరియా బుకింగ్, బ్యాంకు రుణాల వివరాలకు అనుసంధానం చేస్తారు. అదే విధంగా క్రాప్ బుకింగ్‌లోనూ 87 శాతం మంది రైతులే పంటలు సాగు చేస్తున్నట్లుగా లెక్క తేలింది. మిగతా వారంతా ఎలాంటి పంటలు సాగు చేయకుండానే రైతులుగా చలామణి అవుతున్నారు. ఇందులో ప్రధానంగా ఫామ్‌ల్యాండ్ వెంచర్లలో గుంటల చొప్పున కొనుగోలు చేసినవారే ఎక్కువగా ఉన్నారని వ్యవసాయాధికారులే ధ్రువీకరిస్తున్నారు. గుంట చొప్పున వ్యవసాయ భూమి ఉన్నవారే జిల్లాలో లక్ష మంది దాకా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీరందరి వివరాలు సేకరించడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
ఫామ్‌ల్యాండ్ వెంచర్లతో పెరిగిన రైతులు..
మండలం | 2020లో రైతులు | 2026లో రైతులు |
నాగల్‌గిద్ద | 9,596 | 21,076 |
కంగ్టి | 13,303 | 23,853 |
మానూరు | 12,600 | 16,260 |
సిర్గాపూర్ | 8,573 | 14,028 |
మొత్తం | 44,072 | 75,217 |
ఇవి కూడా చదవండి...
దసరా కానుక!
రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి
Read Latest Telangana News And Telugu News