నా హోటళ్లకు ముఖ్యమంత్రి ప్రచారం
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:32 AM
అమెరికాలో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో తాను 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని.. కుటుంబం కోసం వ్యాపారం చేయడం తప్పా..? అని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
నాకు హోటల్ ఉందని 2009 ఎన్నికల అఫిడవిట్‌లోనే చెప్పా
ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పింది ఏముంది సీఎం రేవంత్..?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో తాను 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని.. కుటుంబం కోసం వ్యాపారం చేయడం తప్పా..? అని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సిరిసిల్లలో సీఎం రేవంత్ చెప్పినదంతా నేను ఎప్పుడో చెప్పా.. నాకు హోటల్ ఉన్నట్లు 2009 ఎన్నికల అఫిడవిట్‌లోనే రాశాను. ఆ విషయాన్ని కొలంబస్ లెక్క.. వాస్కోడిగామా లెక్క ఏదో కనుగొన్నట్లు నువ్వేంది చెప్పేది. అఫిడవిట్‌లో ఉన్నదే నువ్వు చెప్పినవ్. భార్యాపిల్లలకు బువ్వ పెట్టాలె కదా.. వాళ్లకోసం వ్యాపారం చేయడం తప్పా? నేను ఉన్నత చదువులు చదివా.. నీలా (రేవంత్) ఏళ్ల తరబడి డిగ్రీ చదవలేదు. 2006లో ప్రారంభించిన హోటల్ వ్యాపారం 20 ఏళ్లలో మూడు హోటళ్లకు పెరిగింది. ఈ రాజకీయాల్లోకి రాకుండా వ్యాపారంపై మరింత దృష్టిపెట్టి ఉంటే మరో పది హోటళ్లు కూడా ఏర్పాటు చేసేవాడిని. ఏదేమైనానా హోటళ్లకు ఉచిత ప్రచారం కల్పించినందుకు సంతోషంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.
తాను కుటుంబం కోసం బుద్ధిగా వ్యాపారం చేసుకుంటున్నానని.. సీఎం రేవంత్‌లాగా మందిమీద పడి దోచుకోలేదని అన్నారు. సీఎం బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి అర్హత లేదని తాము ప్రశ్నించిన తర్వాత కూడా రూ.1,000 కోట్ల టెండర్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తొమ్మిదో తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి ఏరోస్పేస్ ఇంజనీర్ ఎలా అయ్యారని, రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.7కోట్లకు ఆయనకు ప్రభుత్వం ఎలా ఇచ్చిందని నిలదీశారు. ‘నీకు దమ్ముంటే.. నీ ఆస్తులు, నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు’ అని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
ఓటమి భయంతోనే పిటిషన్..
ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమి పాలవుతుందన్న భయంతోనే... రేవంత్‌రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఉప ఎన్నికను ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ద్వారా కోర్టులో పిటిషన్ వేయించారని విమర్శించారు. సీఎంకు దమ్ముంటే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, ఒక సంవత్సరం తర్వాత కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుందని ఎద్దేవా చేశారు. రేవంత్ ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ నాశనమవుతుందని అన్నారు. శత్రుదేశంపై దండయాత్రకు వెళ్లినట్లు సీఎం సిరిసిల్ల పర్యటన సాగిందని మండిపడ్డారు. నల్లమల పులిని అని చెప్పుకుంటున్న ఆయన 4 వేల మంది పోలీసులను వెంట పెట్టుకొని వెళ్లారని తెలిపారు.
‘నువ్వు నల్లమల పులివి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లివి’ అని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల పర్యటనలో సీఎం చుట్టూ పోలీసులు తప్ప ప్రజలు కనిపించలేదని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోతే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. కాగా, దక్షిణ కొరియా అధ్యక్షుడి సలహాదారు ప్రొఫెసర్ యంగ్‌టే చో, సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రతినిధి బృందంతో కేటీఆర్ తెలంగాణ భవన్‌లో గురువారం భేటీ అయ్యారు. కొరియా కంపెనీలకు తెలంగాణలో అపారఅవకాశాలున్నాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఎన్నికల కమిషన్, హైదరాబాద్ తగలబడిపోతయ్
ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించునో!?
Read Latest Telangana News And Telugu News