పాదరస కాలుష్యానికి సాంకేతికతతో చెక్
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:55 AM
పాదరస కాలుష్యాన్ని గుర్తించేందుకు, నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తున్నాయి. గాలి, నీరు, నేల, ఆహార పదార్థాలు, చేపలు, జుట్టు, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా మనుషులు, పర్యావరణంపై పాదరసం ప్రభావం చూపుతున్న నేపథ్యంలో..
పొగ నుంచి వెంట్రుకల దాకా.. కాలుష్యాన్ని పసిగట్టే పరికరాలు
గాలి, నీరు, ఆహారం, ఔషధాల్లో పాదరసాన్ని గుర్తించే యంత్రాలు
ఐదు నిమిషాల్లోనే ఫలితాలు.. క్షేత్రస్థాయిలోనూ పరీక్షలు
ఐఐటీ హైదరాబాద్‌లో వివిధ దేశాల సంస్థల ప్రదర్శనలు
కంది, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పాదరస కాలుష్యాన్ని గుర్తించేందుకు, నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తున్నాయి. గాలి, నీరు, నేల, ఆహార పదార్థాలు, చేపలు, జుట్టు, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా మనుషులు, పర్యావరణంపై పాదరసం ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. కాలుష్యం ఎక్కడ, ఎంత మేరకు ఉందో క్షణాల్లో గుర్తించే పరికరాలు కీలకంగా మారుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌లో జరుగుతున్న 17వ అంతర్జాతీయ పాదరస కాలుష్య సదస్సులో వివిధ దేశాలకు చెందిన సంస్థలు తమ ఆధునిక పరికరాలు, నియంత్రణ సాంకేతికతలను ప్రదర్శించాయి.
కాలుష్య నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా? పాదరస ఉద్గారాలు నిర్ణీత పరిమితుల్లోనే ఉన్నాయా? అనే అంశాలను పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. పరిశ్రమల్లో నిరంతర ఉద్గార పర్యవేక్షణ వ్యవస్థల్లో ఇది కీలకమైన సాంకేతికతగా మారింది. పాదరసం విడుదలైన తరువాత దాన్ని పట్టుకోవడం కంటే.. మొదటిదశలోనే పాదరసం వినియోగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం మరింత సమర్థవంతమైన మార్గంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మందుల్లో పాదరస కాలుష్యంపై
జపాన్‌కు చెందిన నిస్సాన్ ఇన్‌స్ట్రుమెంట్ సంస్థ అభివృద్ధి చేసిన ఎంఏ-3000 పరికరం ఔషధాల తయారీ దశలో పాదరస కాలుష్యాన్ని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. కాగా, రష్యాకు చెందిన ల్యూమెక్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ సంస్థ పాదరసం గుర్తింపులో వినూత్న పరికరాలను ప్రదర్శిస్తోంది. ఆ సంస్థకు చెందిన ఆర్‌ఏ-915 సిరీస్ పాదరస విశ్లేషణ పరికరాలు గాలి, బొగ్గు, చమురు, చేపలు, జుట్టు వంటి వివిధ నమూనాల్లో పాదరసాన్ని గుర్తించగలవు. పాదరసాన్ని గుర్తించేందుకు జీమాన్ పరమాణు శోషణ స్పెక్ట్రోమెట్రీ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. నమూనాలను ప్రత్యేకంగా ప్రయోగశాలకు పంపి రోజుల తరబడి ఫలితాల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించే అవకాశం ఈ పరికరాల ప్రత్యేకత. ఇక జర్మనీకి చెందిన మెర్క్యురీ ఫ్రీ సంస్థకు చెందిన పాదరస విశ్లేషణ పరికరం ఆహార పదార్థాల్లో పాదరసం ఉందా? అనే అంశాన్ని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వెంట్రుకల నమూనాలను పరీక్షించడం ద్వారా మనిషి శరీరంలో పాదరసం చేరిన స్థాయిని అంచనా వేయడానికి వీలుంటుంది.
హైదరాబాద్ సంస్థ సరికొత్త పరికరం
హైదరాబాద్‌కు చెందిన స్వాన్ ఎన్విరాన్‌మెంటల్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా పాదరస కాలుష్య పర్యవేక్షణకు సంబంధించిన డిజిటల్ విద్యుత్ పరికరాన్ని ప్రదర్శిస్తోంది. పరిశ్రమల్లో అమర్చినప్పుడు గాలి, నీటి సంబంధిత వ్యవస్థల్లో పాదరస కాలుష్యాన్ని గుర్తించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పరికరం సామర్థ్యం, పరిమాణాన్ని బట్టి ధర సుమారు రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు ఉంటుందని చెప్పారు. కాలుష్య నివారణ వ్యవస్థలకు ఈ పరికరాలు పర్యవేక్షణ పరంగా సహకరిస్తాయన్నారు. దీంతోపాటు ఇటలీకి చెందిన మైల్‌స్టోన్ సంస్థ అభివృద్ధి చేసిన డైరెక్ట్ మెర్క్యూరీ అనలైజర్ పరికరం వేగవంతమైన పరీక్షలకు ఉపయోగపడుతుంది.
ఘన, ద్రవ, వాయు నమూనాల్లో పాదరసం స్థాయిని గుర్తించేందుకు రూపొందించిన ఈ పరికరంలో తక్కువ పరిమాణంలో నమూనాను ఉంచితే.. ఐదు నిమిషాల్లోనే ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాగా, అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సంస్థ అభివృద్ధి చేసిన ఎంపీఎం-పాదరస పోర్టబుల్ మానిటర్ చిన్న వాకీటాకీ ఆకారంలో ఉంటుంది. చేతిలో పట్టుకుని లేదా దుస్తులకు అమర్చుకుని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణ నిర్వహించేందుకు వీలుంటుంది. ముఖ్యంగా గ్యాస్ సంస్థలు, గనుల పరిశ్రమలు, రసాయన పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి ఇలాంటి పరికరాలు ఉపయోగపడతాయి.
ఇవి కూడా చదవండి...
ఆకాశంలో బియ్యం, నిత్యావసరాల ధరలు
రామప్పను కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
వృత్తి నిపుణులను కాంగ్రెస్ వైపు మళ్లించండి
Read Latest Telangana News And Telugu News