Share News

చేతులెత్తేసిన కొత్త కాంట్రాక్టర్‌?!

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:23 AM

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలకు నిత్యావసరాల సరఫరాను మెరుగుపర్చాలని, విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం, సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన కేంద్రీకృత (సెంట్రలైజ్డ్‌) కాంట్రాక్ట్‌ విధానం.. అసలుకే ఎసరు తెచ్చింది.

చేతులెత్తేసిన కొత్త కాంట్రాక్టర్‌?!
Telangana Gurukul schools supplies

  • ఈ నెల 1 నుంచే గురుకులాలు, హాస్టళ్లకు నిత్యావసరాలు ఇవ్వాల్సి ఉన్నా.. ఉలుకే లేదు

  • గత్యంతరం లేక పాతకాంట్రాక్టర్లకే మళ్లీ బాధ్యత

  • నెల పాటు సరుకులు అందించాలని ఆదేశాలు

  • మిగిలింది 3 రోజులే.. స్పందించని కొత్త కాంట్రాక్టర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలకు నిత్యావసరాల సరఫరాను మెరుగుపర్చాలని, విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం, సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన కేంద్రీకృత (సెంట్రలైజ్డ్‌) కాంట్రాక్ట్‌ విధానం.. అసలుకే ఎసరు తెచ్చింది. టెండరు దక్కించుకున్న నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫార్మర్స్‌ ప్రొక్యూర్మెంట్‌, ప్రాసెసింగ్‌ అండ్‌ రిటైలింగ్‌ కో ఆపరేటివ్స్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏసీవోఎ్‌ఫ) నిత్యావసరాలు సరఫరా చేయలేక చేతులెత్తేసింది. ఈ నెల 1 నుంచే నిత్యావసరాలు సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది.


రాష్ట్రవ్యాప్తంగా వివిధ సొసైటీల పరిధిలో 1024 గురుకులాలు, 243 ఆశ్రమ పాఠశాలలు, 195 ఏకలవ్య స్కూళ్లు, 400పైగా కస్తూర్బా విద్యాలయాలు ఉండగా... వీటిలో 9 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఆయా గురుకులాలు, హాస్టళ్లకు గతంలో జిల్లా స్థాయి కొనుగోలు కమిటీల ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించి నిత్యావసరాల సరఫరా బాధ్యత అప్పగించే వారు. ఈ విధానంలో పారదర్శకత లోపిస్తుందని, సరకులు సక్రమంగా అందడంలేదని భావించిన ప్రభుత్వం...గతానికి భిన్నంగా ఈ సారి సెంట్రలైజ్డ్‌ టెండర్‌కు శ్రీకారం చుట్టింది. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి చైర్మన్‌గా ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ)ను ఏర్పాటు చేసి, టెండర్లు ఆహ్వానించింది. ఏడాది పాటు నిత్యావసరాలు, క్లీనింగ్‌ మెటీరియల్‌ సహా మొత్తం 88 రకాల వస్తువుల సరఫరా కోసం టెండర్లు పిలవగా, ఎన్‌ఏసీవోఎ్‌ఫ సంస్థ దక్కించుకుంది.


అయితే.. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి మూడు నెలల పాటు లేదా కేంద్రీకృత టెండరు పూర్తయ్యే వరకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోనే సరుకులు కొనుగోలు చేసి సరఫరా చేసేలా వెసులుబాటు కల్పించారు. ఆ కాలపరిమితి ఆగస్టు 31వ తేదీన ముగియడంతో నిత్యావసరాల సరఫరా కోసం ఎన్‌ఏసీవోఎ్‌ఫ సంస్థకు లెటర్‌ ఆఫ్‌ అవార్డు జారీ చేశారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచే ఎన్‌ఏసీవోఎ్‌ఫ సంస్థ సరకులు సరఫరా చేయాల్సి ఉన్నా.. ప్రారంభం కాలేదు. ఎప్పటి నుంచి సరుకులు సరఫరా చేస్తారనే అంశంపై అధికారులకూ సరైన సమాచారం లేదు. మరోవైపు.. గురుకులాలు, ఇతర ఆశ్రమ పాఠశాలల్లో బియ్యం తప్ప ఇతర నిత్యావసరాలన్నీ ఖాళీ కావడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


దీంతో వందలాది మంది పిల్లలకు ప్రతిరోజూ భోజనం పెట్టడానికి స్థానిక కిరాణా షాపుల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు నెలకు అవసరమైన ప్రొవిజన్స్‌ను పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సరుకులు సరఫరా చేయాలంటే.. ఇప్పటికే గోదాములు తీసుకుని నిల్వ చేసుకోవాలి. కానీ, ఇప్పటిదాకా ఆ సంస్థ నుంచి అలాంటి ప్రయత్నమేదీ జరగలేదని తెలిసింది. ప్రభుత్వం ఇచ్చిన గడువు మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. ఇంతవరకు అప్రమత్తం కాకపోవడం వల్ల వచ్చే నెలలోనైనా కొత్త కాంట్రాక్టు వ్యవస్థ పట్టాలెక్కుతుందో? లేదో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

జీతం ఒక లెక్క... జీవితం మరో లెక్క

పామాయిల్‌ గెలల కొను‘గోల్‌మాల్‌’!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 06:23 AM