నగరంలో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ
ABN , Publish Date - May 13 , 2026 | 08:12 AM
మేడ్చల్ సమీపంలో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది. పని మనుషులుగా చేరి.. ఇంట్లోని దంపతులను కట్టేసి భారీగా నగలు దోచుకుపోయారు.
మేడ్చల్, మే 13: విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్య కేసు దర్యాప్తులో ఉండగానే.. జవహర్‌నగర్‌లోని కౌకుర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నేపాల్ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. ఈ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న ప్రొ. మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్షీ దంపతులను కట్టేసి.. మత్తుమందు ఇచ్చి నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. 60 తులాల బంగారం, వెండితోపాటు రూ.30 వేల నగదును ఈ గ్యాంగ్ దోచుకుపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఈ దంపతులు మత్తు నుంచి తేరుకుని గట్టిగా కిటికీలో నుంచి అరవడంతో.. ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ ఇంటి తలుపులు తీశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేపాల్‌కు చెందిన ఒక జంట 13 రోజుల క్రితమే తమ ఇంట్లో పని మనుషులుగా చేరారని ఈ దంపతులు పోలీసులకు వివరించారు. ఇటీవలే మరో మహిళ వచ్చి వారి బంధువుగా పరిచయమై తమ ఇంట్లో ఉంటోందని తెలిపారు. సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలు చేసుకుంటామంటే.. అందుకు అంగీకరించామని ఆ దంపతులు చెప్పారు. ఈ వేడుకలకు మరో ముగ్గురు వ్యక్తులు బయట నుంచి వచ్చారని పేర్కొన్నారు.
ఈ వేడుకల అనంతరం భోజనం చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చి తమపై ఈ నేపాలీ గ్యాంగ్ దాడి చేసిందని పోలీసులకు ఆ దంపతులు తెలిపారు. కాళ్లు, చేతులు కట్టేసి తమను బెదిరించడంతో.. మమ్మల్ని చంపకండి.. మీకు కావాల్సింది తీసుకెళ్లమని వారిని కోరినట్లు వారు చెప్పారు. దీంతో ఇంట్లో నగలతోపాటు విలువైన వస్తువులను ఈ గ్యాంగ్ దోచుకుపోయిందన్నారు. అనంతరం ఇంట్లోని సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేసి.. అన్ని గేట్లకు తాళాలు వేసి వారు పరారయ్యారని వివరించారు.
ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నారని చెప్పారు. ఆ ఇంటిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి పరిశీలించారు. దోపిడీ జరిగిన కాలనీలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు.
మరోవైపు జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజను నేపాలీ గ్యాంగ్ దారుణంగా హత్య చేసి.. ఇంట్లోని నగలతో పరారైన సంగతి తెలిసిందే. ఈ ముఠా కోసం గాలింపును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ నేపాలీ ముఠా కూడా ఐపీఎస్ అధికారి ఇంట్లో పని మనుషులుగా చేరిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు
‘నీట్’ రద్దు దురదృష్టకరం: దామోదర
For More TG News And Telugu News