Share News

‘నీట్‌’ రద్దు దురదృష్టకరం: దామోదర

ABN , Publish Date - May 13 , 2026 | 04:37 AM

నీట్‌ పరీక్ష రద్దు కావడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

‘నీట్‌’ రద్దు దురదృష్టకరం: దామోదర

  • విద్యార్థులకు కేంద్రం క్షమాపణ చెప్పాలి : కేటీఆర్‌

హైదరాబాద్‌, మే12 (ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్ష రద్దు కావడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పరీక్ష నిర్వహణలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విఫలమైందని, విద్యార్థుల భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. గతంలో జరిగిన ఘటనల నుంచి గుణపాఠం నేర్చుకుని పకడ్బందీగా పరీక్ష నిర్వహించకుండా ఎన్‌టీఏ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరైన రీతిలో స్పందించి ఇంత పెద్ద తప్పిదానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి రాజనర్సింహ డిమాండ్‌ చేశారు. కాగా, ప్రశ్నపత్రం లీకేజీ వల్ల నీట్‌ పరీక్ష రద్దు కావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరీక్షకు ముందు రోజు వందకు పైగా ప్రశ్నలు బయటకు రావడం వ్యవస్థలోని దారుణమైన లోపాలను బయటపెట్టిందని కేటీఆర్‌ అన్నారు. లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా శిక్షించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కాగా, నీట్‌ పరీక్ష రద్దుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్‌టీఏలో ప్రక్షాళన చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ డిమాండ్‌ చేశారు. కాగా, నీట్‌ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పరీక్ష రద్దు ప్రధాని మోదీకి, కేంద్రానికి మచ్చలాంటిదని సీపీఐ కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ కె. నారాయణ తెలిపారు.

Updated Date - May 13 , 2026 | 04:37 AM