Share News

ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవీఎస్‌ రాజు కన్నుమూత

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:42 AM

మౌలిక సదుపాయాల రంగంలో (ఇన్‌ఫ్రా) దేశవ్యాప్తంగా చెరగని ముద్ర వేసిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌సీసీ) వ్యవస్థాపక చైర్మన్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్‌ రాజు) మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవీఎస్‌ రాజు కన్నుమూత
AVS Raju

  • ఎన్‌సీసీ ద్వారా ఇన్‌ఫ్రా రంగంపై చెరగని ముద్ర

  • నిర్మాణంలో మేటి కంపెనీగా

  • తీర్చిదిద్దిన పారిశ్రామిక దిగ్గజం

  • ఆయన కృషికి గుర్తింపుగా 2010లో పద్మశ్రీ పురస్కారం

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మౌలిక సదుపాయాల రంగంలో (ఇన్‌ఫ్రా) దేశవ్యాప్తంగా చెరగని ముద్ర వేసిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌సీసీ) వ్యవస్థాపక చైర్మన్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్‌ రాజు) మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిపాలెంలో 1937 ఏప్రిల్‌ 18న ఏవీఎస్‌ రాజు జన్మించారు. 19 ఏళ్ల వయసులోనే తన వ్యాపార ప్రయాణం ప్రారంభించిన ఆయన.. 1978లో ఎన్‌సీసీని ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాల కల్పనలో మేటి కంపెనీగా తీర్చిదిద్దారు.


ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత పరంగా రాజీపడకపోవడం, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడం ఎన్‌సీసీ విజయ రహస్యమని ఏవీఎస్‌ రాజు తరచూ చెప్పేవారు. ఎన్‌సీసీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సాగు, తాగునీటి ప్రాజెక్టులు, భవన నిర్మాణం, విద్యుత్‌ ప్రసారం-పంపిణీ, గనులు, రైల్వేలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణంలో సేవలు అందిస్తోంది. మౌలిక రంగంలో ఏవీఎస్‌ రాజు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. పలు సంస్థలు కూడా ఏవీఎస్‌ రాజు కృషిని గుర్తిస్తూ పురస్కారాలు అందజేశాయి. వ్యాపార, సామాజిక రంగాల్లో రాజు వారసత్వాన్ని కొనసాగిస్తామని ఎన్‌సీసీ లిమిటెడ్‌ ప్రకటించింది.


సత్యసాయి బాబా భక్తుడు

ఏవీఎస్‌ రాజుకు పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఎంతో ఇష్టం. సత్యసాయి బాబాపై భక్తితో ఆయన 24,000 పద్యాలు కూడా రాశారు. 2008లో దాన్ని 42 సంపుటాలుగా ప్రచురించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.


ఈ వార్తలు కూడా చదవండి

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భార్యకు ’గురూజీ‘ వల

సింగరేణి కార్మికులకు బోనస్‌ బొనాంజా

సంస్కృత విద్యాపీఠానికి శాశ్వత భవనం!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 05:42 AM