Share News

విద్యుత్తు లెక్కలన్నీ బహిర్గతం!

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:16 AM

విద్యుత్తు రంగంలో వివిధ సంస్థల వద్ద విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఒకే చోటికి చేర్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ నిర్ణయించింది.

విద్యుత్తు లెక్కలన్నీ బహిర్గతం!
National Electricity Data Portal

  • విద్యుత్తు డేటా పోర్టల్‌కు కేంద్రం ప్రతిపాదన

  • కీలక గణాంకాలు ఉచితం

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు రంగంలో వివిధ సంస్థల వద్ద విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఒకే చోటికి చేర్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్‌ ఎలక్ట్రిసిటీ డేటా షేరింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌-2026ను రూపొందించి, జాతీయ విద్యుత్తుడేటా పోర్టల్‌ (ఎన్‌ఈడీపీ) ఏర్పాటును ప్రతిపాదించింది. విద్యుదుత్పత్తి, సరఫరా, వినియోగం, అంతరాయాలు, గ్రిడ్‌ నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం వివరాలు ఈ పోర్టల్‌లో ప్రామాణిక పద్థతిలో అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉత్పత్తి సంస్థలు, ట్రాన్స్‌మిషన్‌ లైసెన్సీలు, డిస్కమ్‌లు, లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రాలు, ఈఆర్‌సీలు సమాచారాన్ని వేర్వేరు విధానాల్లో నిర్వహిస్తున్నాయి. దీనివల్ల సమగ్ర విశ్లేషణ కష్టమవుతోందని కేంద్రం గుర్తించింది. సమాచారాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఒకటి ప్రజా సమాచారం. స్థాపిత సామర్థ్యం, రాష్ట్రాలవారీ పునరుత్పాదక ఇంధన గణాంకాలు, ఉత్పత్తిలో వనరుల వాటా వంటి వివరాలను రిజిస్ట్రేషన్‌ లేకుండానే ఉచితంగా చూడొచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


బల్క్‌ డేటా లేదా ఓపెన్‌ ఏపీఐ ద్వారా పొందాలంటే మాత్రం రిజిస్ట్రేషన్‌ అవసరం. వాణిజ్య అవసరాలకు రుసుము విధించే అవకాశం ఉంది, పరిశోధనా సంస్థలకు రాయితీ ఇవ్వొచ్చు. రెండోది అనుమతితో పొందాల్సిన సమాచారం. ఫీడర్‌ స్థాయి నిర్వహణ వివరాలు, అంతరాయాల సవివర సమాచారం, స్మార్ట్‌ మీటర్ల వినియోగ గణాంకాలకు రిజిస్ట్రేషన్‌, గుర్తింపు ధ్రువీకరణ, అనుమతి తప్పనిసరి. ఎవరు, ఎందుకు వినియోగిస్తారన్నదీ పరిశీలిస్తారు. ఇలాంటి అభ్యర్థనలపై ఏడు పని దినాల్లో నిర్ణయం తీసుకోవాలి. అనుమతి ఇచ్చిన 14 పని దినాల్లో సమాచారం అందించాలి. డేటా నిర్వహించే సంస్థలు తమ మెటాడేటా జాబితాను ఫ్రేమ్‌వర్క్‌ అమల్లోకి వచ్చిన 12 నెలల్లో ప్రచురించాలి.


ప్రజా సమాచార మెటాడేటాను 18 నెలల్లో పోర్టల్‌లో పొందుపరిచి, కనీసం ఆరు నెలలకోసారి నవీకరించాలి. చట్టాల ప్రకారం ఇప్పటికే వెల్లడించాల్సిన సమాచారంపై ఈ ఫ్రేమ్‌వర్క్‌ ప్రభావం ఉండదు. ఈవీ, పట్టణ ప్రణాళికకూ ఊతం ఈవీ చార్జింగ్‌ కేంద్రాల ప్రణాళిక, భవనాల్లో ఇంధన సామర్థ్యం, వాతావరణ నివేదికలు, గ్రీన్‌ ఫైనాన్స్‌ వంటి అవసరాలకూ ఈ డేటాను వినియోగించుకోవచ్చని కేంద్రం పేర్కొంది. గ్రిడ్‌ భద్రతకు ముప్పు కలిగించే కీలక మౌలిక సదుపాయాల సమాచారం బహిర్గతం కాకూడదని స్పష్టం చేసింది. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు లీక్‌ కాకుండా సైబర్‌ భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:16 AM