మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:55 PM
మూసీ నది అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టనున్నారు అధికారులు.
హైదరాబాద్, ఫిబ్రవరి 11: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(MRDCL) బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు పరిధిలో భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు అధికారులు.
హైదరాబాద్, గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో భూముల సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. భూ యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయా యజమానులు తమ హక్కుల పత్రాలు(పట్టాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు) నిర్దేశిత సమయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏమైనా అభ్యంతరాలుంటే నిర్ణీత సమయంలో తెలియజేయాలని అధికారులు సూచించారు.
సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను కూడా ప్రకటించారు. Land Acquisition Act, 2013 నిబంధనల ప్రకారం.. ఈ భూసేకరణ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసి అభివృద్ధి పనులు దశలవారీగా కొనసాగనున్నాయి. మొత్తం గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో, 14 మండలాలు, 46 గ్రామాల్లో మూసీ అభివృద్ధి జరగనుంది.
ఇవి కూడా చదవండి...
ఎమ్మెల్యే సతీమణి డిజైనర్ స్టోర్‌లో చోరీ.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
Read Latest Telangana News And Telugu News