మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే జరిగేది అదే: కేటీఆర్
ABN , Publish Date - Jan 21 , 2026 | 04:45 PM
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్, జనవరి 21: రానున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని.. పార్టీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్, తాను ప్రచారం చేయాల్సిన అవసరం లేదని.. పార్టీ స్థానిక స్థాయిలో బలంగా ఉందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం సర్పంచ్ సీట్లు గెలిచామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుస్తామన్నారు. శివరాత్రి లోపుగా మున్సిపల్ ఎన్నికలు ముగిస్తారని.. వీటికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ సాధించిందేమీ లేదు..
సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేసినా.. కాంగ్రెస్ సాధించింది ఏమీలేదని కేటీఆర్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత.. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలే అని మాజీ మంత్రి కామెంట్స్ చేశారు.
జిల్లాలు ఎత్తేసే కుట్ర..
రాష్ట్రంలో జిల్లాలను ఎత్తేసే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. జనగాం, నారాయణపేట, వనపర్తి, సిద్దిపేట్, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను రద్దు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాల ఎత్తివేత ఖాయమని.. జిల్లాలు ఉండాలా? పోవాలా? అనేది మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. స్థానిక సమస్యల ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల్లో ఓటువేస్తారని చెప్పారు. సర్వేలు, అభ్యర్థి బలాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తున్నామని తెలిపారు. 8 ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయని తెలిపారు. బస్తీబాట కార్యక్రమంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నామని.. పేదలకు తాము చేసినవి, కాంగ్రెస్ రెండేళ్లలో చేయనివి గుర్తుచేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆ దమ్ముందా?
ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చూపలేకపోయారని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ కేసులో దోషులుగా చెబుతున్న ‘గ్రీన్ కో’తో దావోస్‌లో రేవంత్ చర్చలు జరుపుతున్నారని తెలిపారు. బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పనులతో జంట నగరాల అస్తిత్వం దెబ్బతింటోందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణకు 1,000 కోట్ల పెట్టుబడులు.. దావోస్‌లో సర్కార్ కీలక ఒప్పందం
ప్రేమజంటను కారులో బలవంతంగా తీసుకెళ్లి... ఆపై
Read Latest Telangana News And Telugu News