సిట్‌కు సహకరించండి.. తప్పు చేస్తే శిక్ష అనుభవించండి: ఎంపీ చామల కిరణ్
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:32 PM
బీఆర్‌ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చేరిపివేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు వస్తుందా అని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆందోళనలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ‘పింకీలకు నా సూటి ప్రశ్న’ అంటూ గులాబీ నేతలను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మ గౌరవం అంటూ లబోదిబోమంటున్నారని.. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ నుంచి పరికరాలు కొనుగోలు చేస్తారా అని నిలదీశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లో సీసీ కెమెరాలు బంద్ చేసి పరికరాలు, ఫైల్స్ ధ్వంసం చేసి మూసీ నదిలో, వికారాబాద్ అడవుల్లో పడేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పింకీలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరినీ ఎదగకుండా చేద్దామనే కుట్ర చేశారని ఎంపీ ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చేరిపేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు వస్తుందా అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ పౌర హక్కులు హరించబడ్డాయని.. ప్రతిపక్ష నాయకులు, అధికారులు, సొంత బిడ్డ, అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని విమర్శించారు. తెలంగాణలో అరాచక పాలన చేశారని కవిత చెప్పారని తెలిపారు. టీఆర్ఎస్ పేరులో తెలంగాణ అనే పదాన్ని తీసివేసి బీఆర్ఎస్ అని పెట్టినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని నిలదీశారు. తెలంగాణ ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని కేసీఆర్ చెప్పారని.. తెలంగాణ అమరవీరులను విస్మరించినప్పుడు కేసీఆర్‌కు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదా అని ఎంపీ ప్రశ్నలు సంధించారు.
ఎంపీ అడిగిన ప్రశ్నలివే..
‘గద్దర్‌ను నీ గేటు దగ్గర ఆపినప్పుడు ఆత్మగౌరవం ఎటు పోయింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి తీసుకువెళ్లినప్పుడు ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదా..? మహమూద్ అలీ హోంమంత్రిగా ఉంటే ప్రగతి భవన్ గేటు బయట నుంచి వెనక్కి పంపలేదా...? బీసీ బిడ్డ ఈటెల రాజేందర్‌ను మానసికంగా క్షోభ పెట్టలేదా...? మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు కదా...? ఉచిత బస్సుల విషయంలో మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడినప్పుడు ఆత్మ గౌరవం ఎటు పోయింది? ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాము. ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తామని విర్రవీగారు. ఆడ బిడ్డల తల్లులు వచ్చి మా బిడ్డల భవిష్యత్ ఏంటి అని అడిగితే మా కోసం కన్నారా అని అన్నప్పుడు కేటీఆర్‌కు ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదా...? నిరసనల పేరుతో తెలంగాణ ప్రజల ముందు డ్రామాలు చేస్తున్నారు’ అంటూ ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు..
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను తరిమికొట్టి ఆత్మ గౌరవాన్ని కాపాడారని ఎంపీ అన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మోసం చేయలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదన్నారు. తెలంగాణ రాగానే తన కుటుంబంలో ఐదుగురికి కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చారని.. ఇంటికో ఉద్యోగం అని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ సీఎంకు తెలియకుండా జరగదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభాకర్ రావు ఎందుకు పారిపోయారని నిలదీశారు. బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. డ్రామారావు.. అగ్గిపెట్టె డ్రామాలు బంద్ చేయాలి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాయలసీమ వెళ్లి రతనాలసీమను చేస్తాను అని అన్నప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం ఎటు పోయిందని అడిగారు. ‘సిట్‌కు సహకరించండి, తప్పు చేస్తే శిక్ష అనుభవించండి’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్‌కు కేసీఆర్.. పోలీసుల అలర్ట్
కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్
Read Latest Telangana News And Telugu News