కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్
ABN , Publish Date - Feb 01 , 2026 | 10:28 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖను హైఅలర్ట్ చేస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్ మెసేజ్ జారీ చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను హైఅలర్ట్ చేశారు. కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్లు, ఎస్పీలకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్ జారీ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. విచారణ పూర్తయ్యే వరకు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులపై తక్షణం స్పందించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరికలు జారీ చేశారు.
బీఆర్‌ఎస్ నిరసన
కేసీఆర్ సిట్ విచారణకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. ఇది రాజకీయ ప్రతీకార చర్యగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ విచారణ జరగడం ప్రజల దృష్టిని మళ్లించేందుకే అని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
నందినగర్‌లో జరిగే సిట్ విచారణ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి అవసరాన్ని బట్టి నందినగర్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, ఎన్‌టీఆర్ భవన్, రోడ్ నెంబర్-12 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపేయడం లేదా మళ్లింపు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి...
ఈ-పంటలో రైతులే నమోదు చేసుకోవచ్చు
కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్.. ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన
Read Latest Telangana News And Telugu News