ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్‌కు కేసీఆర్.. పోలీసుల అలర్ట్
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:06 PM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలోనే విచారణ జరుగనుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) (Former CM KCR) సిట్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. సిట్ విచారణ సందర్భంగా నందినగర్ నివాసం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి నాలుగు వైపులా బారికేడ్లు అమర్చి, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు.

సిట్ విచారణ మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలోనే జరుగనుంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళనలు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. నిలోఫర్ కేఫ్‌తో పాటు సమీపంలోని రెస్టారెంట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద భద్రతను మరింత పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వాహనాల మళ్లింపులు చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు ఈ విచారణను రాజకీయ ప్రతీకారంగా చూస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. అయితే శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని సూచించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

కేసీఆర్ నివాసానికి సిట్ టీమ్
కేసీఆర్‌ను విచారించేందుకు సిట్ టీమ్ నందినగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ ఇంట్లోని విచారణ గదిని పరిశీలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాంకేతిక ఆధారాలను, ఎలక్ట్రానిక్ పరికరాలను కేసీఆర్ నివాసానికి సిట్ టీమ్ తరలించింది.
ఇవి కూడా చదవండి...
కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్.. ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన
కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్
Read Latest Telangana News And Telugu News