రియల్ మాఫియాకు మియాపూర్ భూములు విక్రయించేందుకు కుట్ర
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:06 AM
మియాపూర్ పరిధిలోని రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు విక్రయించేందుకు కుట్ర పన్నుతోందని, దీనిని అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు.
మిగులు భూమి ప్రజావసరాలకే వినియోగించాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
మియాపూర్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : మియాపూర్ పరిధిలోని రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు విక్రయించేందుకు కుట్ర పన్నుతోందని, దీనిని అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. మియాపూర్ సర్వే నంబర్లు 100, 101లోని 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ భూములను అమ్మాలని నిర్ణయించినట్లుగా సర్కారు ప్రకటించిన సందర్భంగా బుధవారం ఎంఏనగర్ కాలనీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు పర్యటించారు.
ఏళ్ల తరబడి అక్కడే నివాసం ఉంటూ ఇళ్ల్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిలో.. ఎం.ఏ.నగర్, స్టాలిన్‌నగర్ వంటి పేదల కాలనీలు పోను మిగిలిన 400 ఎకరాలను ప్రజా ప్రయోజనాలకే వినియోగించాలని డిమాండ్ చేశారు. ఖజానా నింపుకోవడానికో లేదా రియల్ వ్యాపారుల లాభాల కోసమో కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఈ భూములను అమ్మి సొమ్ము చేసుకునే బదులు, అన్ని హంగులతో కూడిన పెద్దాసుపత్రి, ప్రభుత్వ స్కూల్, కళాశాల, ప్రజల ఆహ్లాదం కోసం పార్కులు, నిరుపేదలకు పక్కా గృహనిర్మాణం వంటి ప్రజాహిత పనులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతేరాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్‌ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News