బీఆర్ఎస్ అందుకే రాజ్యసభ అభ్యర్థిని పెట్టలేదు: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:26 PM
కాంగ్రెస్‌ను బలహీనపరచడానికే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. జీవన్ రెడ్డికి పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేస్తూ, కేసీఆర్ బాధ్యతగా శాసనసభకు హాజరవ్వాలని సూచించారు.
హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మంత్రి శ్రీధర్ బాబు చిట్‌చాట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నందున దాన్ని బలహీనపరచడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. జీవన్ రెడ్డి విషయంపై స్పందిస్తూ.. ఆయన ఎలాంటి పదవులు కోరుకోలేదని, స్థానిక సమస్యలే ఉన్నాయని తెలిపారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
బాధ్యతగా శాసనసభకు హాజరవ్వాలి..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుభవజ్ఞుడని, బాధ్యతగా శాసనసభకు హాజరవ్వాలని శ్రీధర్ బాబు సూచించారు. నామినేటెడ్ పదవుల విషయంలో హైకమాండ్ కసరత్తు చేస్తోందని, పోర్ట్‌ఫోలియో కేటాయింపులు ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని చెప్పారు. భవిష్యత్తులో సీఎం ఎవరనే అంశాన్ని ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.15 వేల కోట్ల బకాయిలను గత ప్రభుత్వం వదిలేసిందని ఆరోపించారు. అయితే.. వాటిని ప్రస్తుత ప్రభుత్వం చేసిన బకాయిలుగా చూపుతున్నారని అన్నారు. పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ ఫ్లోర్ కమిటీలు త్వరలోనే భర్తీ అవుతాయని తెలిపారు.
నమ్మకం లేకనే అభ్యర్థిని పెట్టలేదు..
అనిరుధ్ రెడ్డి ప్రతిపాదించిన ఇప్పపువ్వు సారా అంశంపై స్పందిస్తూ.. అది మంచి ఆలోచనగా అభివర్ణించారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పనిచేస్తూ సిక్సర్లు కొడుతుంటే, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ అసెంబ్లీ బయటే ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఎవరూ ఏ వర్గాన్ని అవమానించేలా మాట్లాడకూడదని సూచిస్తూ.. ఇప్పటికే మందుల సామేలు వివరణ ఇచ్చారని, అవసరమైతే మళ్లీ వివరణ ఇస్తారని చెప్పారు. బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే రాజ్యసభ అభ్యర్థిని నియమించలేదని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
ఓంకార్ గొప్ప నాయకుడు.. ఆయన సేవలు మరువలేనివి: మంత్రి సీతక్క
బీజేపీ కార్యకర్తలపై దాడి.. సీఎం స్పందించాల్సిందే: రాంచందర్‌రావు
Read Latest Telangana News