Share News

ఓంకార్ గొప్ప నాయకుడు.. ఆయన సేవలు మరువలేనివి: మంత్రి సీతక్క

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:05 PM

మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 6 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా రాజకీయాలకు విలువలు అద్దిన రాజకీయ దురంధరుడని ఆమె కొనియాడారు.

ఓంకార్ గొప్ప నాయకుడు.. ఆయన సేవలు మరువలేనివి: మంత్రి సీతక్క
Seethakka On Maddikayala Omkar

హైదరాబాద్‌: రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఓంకార్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడని, ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్ర విశేషమని గుర్తుచేశారు. అండర్ గ్రౌండ్ నుంచి ఓవర్ గ్రౌండ్ వరకు ఆయన సాగించిన పోరాటం అపార అనుభవాన్ని అందించిందని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కూడా ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.


రాజకీయ దురంధరుడు..

ఉద్యమాలు, క్రమశిక్షణ, ప్రజాసేవ వంటి విలువలను ఓంకార్ నుంచి నేర్చుకున్నానని సీతక్క వెల్లడించారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని, ఆయనలేని లోటు నర్సంపేటకే కాకుండా యావత్ తెలంగాణకే తీరని లోటుగా మిగిలిందని అన్నారు. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా రాజకీయాలకు విలువలు అద్దిన రాజకీయ దురంధరుడని కొనియాడారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ చట్టసభల్లో గళం వినిపించిన నిస్వార్థ ప్రజాసేవకుడిగా ఓంకార్ నిలిచారని చెప్పారు. అలాంటి గొప్ప నాయకుడి చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు.


ట్యాంక్‌బండ్‌పై ఓంకార్ విగ్రహం..

సురవరం ప్రతాప్ రెడ్డి, గద్దర్, అందెశ్రీ వంటి ప్రముఖుల చరిత్రను ప్రజలకు తెలియ చేస్తున్నామని, అదే విధంగా ఓంకార్ సేవలను కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. అలాగే ట్యాంక్‌బండ్‌పై ఓంకార్ విగ్రహం ఏర్పాటు చేయాలని అభిమానులు కోరుతున్నారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.


యుద్దోన్మాదాన్ని ఖండించాలి..

అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దేశాధినేతను హతమార్చే హక్కు అమెరికాకు ఎవరిచ్చారని ప్రశ్నించారామె. ఇరాన్ మీద దాడిని కూడా ఖండించలేని పరిస్థితుల్లో మన దేశ ప్రభుత్వం ఉందని విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం మౌనం వహించడం సరైంది కాదని, కేంద్ర ప్రభుత్వం అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ రాజీనామా చేయాలి

ఈ క్రమంలోనే మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కేటీఆర్ తన మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్ అన్నారని గుర్తుచేశారు. గత రెండు సంవత్సరాల్లో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.57 వేల కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపారు. అలాగే మహిళా సంఘాలపై ఉన్న వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు.

ఇప్పటివరకు రూ.1390 కోట్ల వడ్డీ చెల్లించామని సీతక్క వివరించారు. ఈ విషయాలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టానని, కేటీఆర్ లెక్కలు సరిచూసుకోవాలని ఆమె సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్ల వడ్డీని ఎగ్గొట్టారని ఆరోపించారు. అలాగే అభయహస్తం నిధులనూ కాజేశారని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎందుకంటే

తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం

Read Latest Telangana News

Updated Date - Mar 17 , 2026 | 05:09 PM