మత్స్యకారులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:47 PM
జువ్వలదిన్నె ఫిష్షింగ్ హార్బర్‌కు రూ.2500 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ వల్ల మత్స్యకారులకు అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందని తెలిపారు.
నెల్లూరు: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిపై కలెక్టరేట్‌లో మత్స్యకార నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు హాజరయ్యారు.
రూ.2500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి..
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. జువ్వలదిన్నెలో ఏర్పడుతున్న సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ మత్స్యకారులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రూ.2500 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, స్థానికంగా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. మత్స్యకారులు కేవలం వృత్తిపరంగా మాత్రమే కాకుండా పారిశ్రామికవేత్తలుగానూ ఎదగాలని సూచించారు. ఇందుకోసం 125 ఎకరాల భూమిని అందుబాటులో ఉంచి MSME పార్కులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు.
వైసీపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు..
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై మత్స్యకారులలో ఉన్న అనుమానాలను సమావేశంలో నివృత్తి చేసినట్లు మంత్రి తెలిపారు. మంచి ప్రాసెసింగ్ చేసిన చేపల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, దీని ద్వారా మత్స్యకారులకు అధిక లాభాలు చేకూరుతాయని చెప్పారు. సాగర్ డిఫెన్స్ కంపెనీ కొంత భూమినే కోరిందని, మిగిలిన ప్రాంతం మత్స్యకారుల ప్రయోజనాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో వైసీపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. పరిశ్రమలు రావడం వల్ల యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గత పాలనలో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పరిశ్రమలు తిరిగి వస్తున్నాయన్నారు.
మత్స్యకారులకు చంద్రబాబు కానుక..
ఎమ్మెల్యే వెంకటకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఫిషింగ్ హార్బర్‌లు.. మత్స్యకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన గొప్ప కానుక అని అన్నారు. హార్బర్‌లకు అనుసంధానంగా పరిశ్రమలు రావాలని ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చినందుకు చంద్రబాబు, నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఉద్దేశం లేదు..
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ.. కృష్ణపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పడిందని, దీనికి అనుబంధంగా అనేక పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. త్వరలోనే ఈ హార్బర్ పూర్తిస్థాయిలో మత్స్యకారులకు అందుబాటులోకి రానుందని తెలిపారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లు హార్బర్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. 50 శాతం రాయితీ
మిషన్ మోడ్‌లో మున్సిపాలిటీల అభివృద్ధి: మంత్రి నారాయణ
Read Latest AP News