Komatireddy Venkat Reddy: మహిళా అధికారుల బదిలీపై మంత్రి కోమటిరెడ్డి ఏం చెప్పారంటే?
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:44 PM
మహిళా అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రశంసలు సహజమని.. వాటిని తాము తట్టుకుంటామని.. కానీ ఐఏఎస్ అధికారుల ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుందని ప్రశ్నించారు.
హైదరాబాద్, జనవరి 10: మహిళా అధికారులపై పలు మీడియా సంస్థల్లో తప్పుడు కథనాలు ప్రసారం అవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పందించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. మహిళా అధికారులపై చెప్పలేని భాషలో కొన్ని ఛానల్స్, సోషల్ మీడియాలో వార్తలు రాయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. మహిళా అధికారులను బదిలీ చేసే అధికారం సీఎంకే ఉంటుందని.. జిల్లా మంత్రులకు చెప్పి ముఖ్యమంత్రి బదిలీ చేయరని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతారని.. అలాంటి వారిపై అబండాలు వేయొద్దని హితవుపలికారు. మహిళా అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
అప్పుడే సగం చనిపోయా.. ఇబ్బంది పెట్టొద్దు..
రాజకీయాల్లో విమర్శలు, ప్రశంసలు సహజమని.. వాటిని తాము తట్టుకుంటామని.. కానీ ఐఏఎస్ అధికారుల ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుందని మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. ‘మా మీద వేస్తే మేము, మా కుటుంబసభ్యులు, బంధువులు బాధపడతారు. రాసినవారు మేము చేసినట్లు చూశారా?.. దేవుడు అంటే నాకు నమ్మకం.. నేను తెలిసి ఏ తప్పు చేయను. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయా. ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు. నన్ను అవమానించి ఏం సాధిస్తారు?. నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు’ అని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తప్పుడు వార్తల మీద విచారణ జరిపించాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు.
సినిమా టికెట్ల ధరల పెంపుపై..
సినిమా టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కొమటిరెడ్డి స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేసినట్లు తెలిపారు. సినిమా టికెట్ల ధరల పెంపుపై తన దగ్గరకు రావొద్దని చెప్పానని.. దీంతో ఎవరూ తనను కలవడానికి రావడం లేదని చెప్పారు. పుష్ప సినిమా సందర్భంగా ఓ మహిళ చనిపోవడం బాధాకరమన్నారు. అప్పటి నుంచే టికెట్ల రేట్ల పెంపు కోసం తన దగ్గరకు రావొద్దని చెప్పానని ఆయన అన్నారు. నిన్నటి సినిమాకు టికెట్ల ధరల పెంపు, రేపటి సినిమాకూ టికెట్ రేట్లు పెంచిన విషయం తనకు తెలీదని చెప్పారు. టికెట్ల రేట్ల పెంపుపై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ఆ విషయంలో ఏం జరుగుతుందో తెలీదని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
అవసరమైతే హెలికాఫ్టర్‌లో తరలిస్తాం..
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనాలతో రోడ్లపై రద్దీ పెరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బాటిల్ నెక్ ప్లేస్ ఉన్న వద్ద జామ్ ఎక్కువ అవుతోందన్నారు. ఈసారి 12 లక్షల వాహనాలు వెళతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఈరోజు నుంచి ట్రాఫిక్ జామ్ ఉంటుందని.. రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు టోల్ ఛార్జీ లేకుండా గేట్ ఎత్తేయాలని చెప్పామని అన్నారు. ప్రత్యామ్నాయ రూట్స్‌లో ప్రయాణికులు వెళ్లాలని సూచించడం జరిగిందన్నారు. ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదం జరిగితే అవసరమైతే హెలికాప్టర్‌లో హాస్పిటల్‌కు తరలిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..
ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..
Read Latest Telangana News And Telugu News