Share News

లక్ష కోట్ల మేఘా మేఘా

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:34 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూపు విలువ రూ.లక్ష కోట్లుగా తేలింది.

లక్ష కోట్ల మేఘా మేఘా
Megha Engineering

  • ఇంజనీరింగ్‌ సంస్థలో రూ.6,540 కోట్ల పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయ సంస్థలు

  • స్ట్రక్చర్డ్‌ ఫైనాన్సింగ్‌ రూపంలో డీకే, హెచ్‌హెచ్‌ క్యాపిటల్‌, వర్డే పార్ట్‌నర్స్‌ పెట్టుబడులు

  • ఓ భారతీయ సంస్థ ఈ తరహా పెట్టుబడులను సమీకరించడం ఆసియాలో ఇదే తొలిసారి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూపు విలువ రూ.లక్ష కోట్లుగా తేలింది. చిన్న సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించి.. అడుగుపెట్టిన ప్రతి రంగంలో దూసుకుపోతున్న మేఘా సంస్థ దేశవ్యాప్తంగా పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపడుతున్న సంగతి తెలిసిందే. దేశీయంగానే కాక.. 20కి పైగా దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించిన ఆ సంస్థ అంతర్జాతీయంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.


తాజాగా ఈ సంస్థ.. అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్‌ సంస్థలైన డేవిడ్‌సన్‌ కెంప్నెర్‌ (డీకే), హిల్‌హౌస్‌ (హెచ్‌హెచ్‌) క్యాపిటల్‌, వర్డే పార్ట్‌నర్స్‌ నుంచి 70 కోట్ల డాలర్లు (సుమారు రూ.6,540 కోట్లు) సమీకరించినట్లు వెల్లడించింది. స్ట్రక్చర్డ్‌ ఫైనాన్సింగ్‌గా పిలిచే లావాదేవీ ద్వారా ఆ మూడు సంస్థలూ ఎంఈఐఎల్‌కు ఆ మొత్తాన్ని సమకూర్చాయి. ఒక భారతీయ సంస్థ.. స్ట్రక్చర్డ్‌ ఫైనాన్సింగ్‌ రూపంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులను సమీకరించటం ఆసియాలోనే ఇది మొదటిసారి. కంపెనీ అభివృద్ధిపై అంతర్జాతీయ మదుపరులకు ఉన్న నమ్మకానికి దీన్ని ఒక నిదర్శనంగా భావిస్తున్నారు. ఈ లావాదేవీలో భాగంగా ఆ ఇన్వె్‌స్టమెంట్‌ సంస్థలకు గ్రూప్‌ కంపెనీ ఈక్విటీతో పాటు రహదారుల ప్రాజెక్టుల నగదీకరణ ప్రతిపాదనతో వాటాను ఇచ్చినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి.


కాగా ఈ లావాదేవీలో భాగంగానే ఎంఈఐఎల్‌ విలువను రూ.లక్ష కోట్లుగా లెక్కించారు. గ్రూప్‌నకు చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్‌ వ్యాపార సంస్థ ‘ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఈపీటీఎల్‌) విలువను రూ.14,000 కోట్లుగా లెక్కగట్టారు.

పెరగనున్న కృష్ణారెడ్డి పట్టు!

సంస్థ ప్రమోటర్లలో ఒకరైన పీవీ కృష్ణారెడ్డికి ఎంఈఐఎల్‌ ఈక్విటీలో 57 శాతం, ఆయన సమీప బంధువైన పి.పిచ్చిరెడ్డికి 43 శాతం వాటాలున్నాయి. ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌ కింద తన వాటాను కృష్ణారెడ్డికి అమ్మేందుకు పిచ్చిరెడ్డి సిద్ధమైనట్టు గత ఏడాది నుంచే వార్తలు వస్తున్నాయి. ఈ అవసరాల కోసమే మేఘా కృష్ణారెడ్డి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈ మొత్తం సమీకరించినట్టు భావిస్తున్నారు. పిచ్చిరెడ్డి వద్ద ఉన్న 43 శాతం వాటా కృష్ణారెడ్డిపరమైతే ఎంఈఐఎల్‌ పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్లనుంది. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ వచ్చే మూడేళ్లలో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)కి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అలాగే అనుబంధ సంస్థ ఈపీటీఎల్‌ను వచ్చే 12 నెలల్లో ఐపీవోకి తీసుకురావాలని భావిస్తోంది. తాజాగా 70 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయం సంస్థలు.. ఈ పబ్లిక్‌ ఇష్యూల ద్వారా తమ పెట్టుబడులు రాబట్టుకుంటాయని భావిస్తున్నారు.


వడివడిగా ఎదుగుదల

1989లో చిన్న కంపెనీగా ప్రారంభమైన మేఘా ఇంజనీరింగ్‌... ప్రస్తుతం దేశంలోని మౌలిక సదుపాయాల నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి కంపెనీగా ఎదిగింది. సంస్థ పోర్ట్‌ఫోలియోలో ముంబై కోస్టల్‌ రోడ్‌, థానే-బోరివలి ట్విన్‌ టన్నెల్‌, జమ్ము కశ్మీర్‌లోని జోజిలా పాస్‌ టన్నెల్‌, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజక్ట్‌ వంటి అనేక భారీ ప్రాజెక్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ ఎంఈఐఎల్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకూ రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులకే పరిమితమైన మేఘా ఇంజనీరింగ్‌ ఇప్పుడు ఈపీసీ పద్ధతిలో సౌర, అణు విద్యుత్‌ కేంద్రాల నిర్మాణ రంగంలోకీ ప్రవేశించింది.


ఇందులో భాగంగా కర్ణాటకలోని కైగా వద్ద భారత అణు ఇంధన సంస్థ ఎన్‌పీసీఐఎల్‌ ఏర్పాటు చేసే రెండు 700 మెగావాట్ల న్యూక్లియర్‌ రియాక్టర్ల నిర్మాణ కాంట్రాక్టు సంపాదించింది. వీటికి తోడు చమురు, గ్యాస్‌ అన్వేషణకు అవసరమైన డ్రిల్లింగ్‌ రిగ్‌లనూ ఎంఈఐఎల్‌ తయారు చేస్తోంది. మేఘా గ్యాస్‌ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సిటీ గ్యాస్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. మరోవైపు ఒలెక్‌ట్రా గ్రీన్‌టెక్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సులు దేశంలోని పలు రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే!!


ఈ వార్తలు కూడా చదవండి:

‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్‌ఎస్‌ నేతల్లో ఆధిపత్య పోరు

అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 04:34 AM