Share News

కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి మరీ..

ABN , Publish Date - Mar 17 , 2026 | 09:29 AM

కూకట్‌పల్లిలో భారీ దోపిడీ జరిగింది. నగదుతో వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లి.. నలుగురు వ్యక్తులు రూ. కోటి నగదుతో పరారయ్యారు. ఈ దోపిడీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి మరీ..

హైదరాబాద్, మార్చి 17: కూకట్‌పల్లిలో భారీ దోపిడీ జరిగింది. నగదు తీసుకెళ్తున్న ఇద్దరు ఏసీ మెకానిక్‌ల కళ్లలో కారం కొట్టి.. దుండగులు దాడి చేశారు. వారి వద్దనున్న రూ. కోటి నగదుతో పరారయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడపట్టారు. నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి.. ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ దోపిడీ అనంతరం నిందితులు ఎటువైపు వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.


కూకట్‌పల్లిలో ఇద్దరు ఏసీ మెకానిక్‌లు ఎండీ ఖుస్రు, ఎండీ అజీముద్దీన్‌లు రూ. కోటి నగదుతో వెళ్తున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారంటూ ఆ ఇద్దరినీ పోలీసులు ప్రశ్నించారు. అయితే వీరి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో.. ఇది హవాలా సొమ్ముగా పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ నగదు తీసుకెళ్తున్న విషయం తెలుసుకుని.. తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడ్డారా?.. ఈ దోపిడీలో ఈ ఇద్దరు ఏసీ మెకానిక్‌ల ప్రమేయం కూడా ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


పట్టుబడిన ముగ్గురు..

మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితుల్లో ముగ్గురిని మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఈ దోపిడీ అనంతరం వీరంతా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పారిపోతుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దొంగిలించిన సొమ్ము హవాలా నగదుగా పోలీసులు గుర్తించారు. బహుదూర్‌పురాకు చెందిన అమీర్ వద్ద ఖుస్రు, అజీముద్దీన్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 7.00 గంటలకు రూ. 10 నోటు ఇచ్చి పవన్‌ను కలవాలని వారికి అమీర్ సూచించారు.


పవన్ నుంచి హవాలా నగదు తీసుకుని ఇబ్రహీం అనే వ్యక్తికి ఇవ్వాలని ఆదేశించారు. దాంతో ఖుస్రో బైక్‌పై అజీముద్దీన్ కూకట్‌పల్లి చేరుకుని పవన్‌ను సంప్రదించారు. పవన్ సూచన మేరకు పిల్లర్ నెం. 825 వద్ద గోకుల్ ఎన్‌క్లేవ్‌‌కు వెళ్లారు. వీరే అని నిర్ధారించుకున్న తర్వాత రూ.కోటి నగదు ఉంచిన కార్టన్ బాక్స్ వారికి అందజేశారు. అనంతరం వీరు పిల్లర్ నెంబర్ 848కి రమ్మని వారికి పవన్ ఫోన్‌ ద్వారా సూచించారు. అక్కడికి చేరుకునే సమయంలో వీరిద్దరిపై దుండగులు దాడి చేసి నగదు దోపిడి చేశారు. దీంతో చోరీ జరిగిన సమయం నుంచి కొన్ని గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కొత్త అమావాస్య వేళ.. పొరపాటున కూడా ఇలా చేయవద్దు?

వైసీపీ ఇన్‌చార్జ్ వీరంగం.. భయాందోళనలో ప్రజలు

For More TG News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 11:13 AM