మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 26 , 2026 | 07:40 PM
దేశం గర్వించదగ్గ జాతిరత్నం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గొప్పవని తెలిపారు. శనివారం భారత్ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి.
హైదరాబాద్, సెప్టెంబర్ 26: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనకు భారతరత్న ఇవ్వడానికి మీకున్న అభ్యంతరమేమిటని కేంద్రాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. దేశ అత్యున్నత పురస్కారంతో ఆయనను సత్కరించక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
శనివారం భారత్ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి. ఈ సందర్భంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్ వద్ద డాక్టర్ మన్మోహన్ సింగ్ క్యాంస విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సీఎం మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ జాతిరత్నం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని అన్నారు. దేశ ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గొప్పవని అభివర్ణించారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారత మాజీ ప్రధాని విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు.
తరతరాలకు దార్శనికుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అని వివరించారు. ఆయన తన విజ్ఞానాన్ని పూర్తిగా దేశానికే అంకితం చేశారంటూ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశంసలు జల్లు కురిపించారు. దేశ ఆర్థిక రంగంలో ఆయన సరళీకృత విధానాలు తెచ్చారని గుర్తు చేశారు. భారత్‌ను సంక్షోభం నుంచి దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గట్టెక్కించారని చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది మన్మోహన్ సింగ్ అని చెప్పారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలన్నీ పేదలకు మేలు చేసేవేనని పేర్కొన్నారు. నాడు తెలంగాణ బిల్లుపై ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతకం చేశారని అన్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టత
మద్యం షాపుల్లో సీసీ టీవీ కెమెరాలు.. ట్రాకింగ్ విధానంతో పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర