Share News

30-40 ఏళ్లకే జీవనశైలి వ్యాధులు

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:46 AM

జీవనశైలి మార్పులతో నేడు చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని.. సగటు ఆయుర్దాయం పెరుగుతున్నా, జీవితంలో చివరి పదేళ్లకు పైగా అనారోగ్య సమస్యలతోనే గడపాల్సి వస్తోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

30-40 ఏళ్లకే జీవనశైలి వ్యాధులు

  • జీవితంలో చివరి పదేళ్లు అనారోగ్యంతోనే

  • చికిత్సతోపాటు వ్యాధుల నివారణకూ ప్రాధాన్యం ఇవ్వాలి

  • యశోద ఆస్పత్రి నిర్వహించిన కార్యక్రమంలో నిపుణుల సూచనలు

  • పాల్గొన్న విజయ్‌ దేవరకొండ, పీవీ సింధు

హైదరాబాద్‌ సిటీ / హైటెక్‌సిటీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జీవనశైలి మార్పులతో నేడు చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని.. సగటు ఆయుర్దాయం పెరుగుతున్నా, జీవితంలో చివరి పదేళ్లకు పైగా అనారోగ్య సమస్యలతోనే గడపాల్సి వస్తోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన, నాణ్యమైన జీవితం గడపడంపై దృష్టి సారించాలని సూచించారు. హైటెక్‌సిటీలోని యశోద ఆస్పత్రిలో బుధవారం ‘ది వెల్‌బీయింగ్‌ రౌండ్‌టేబుల్‌ - యాడింగ్‌ లైఫ్‌ టు ఇయర్స్‌’ పేరుతో నిర్వహించిన సదస్సులో ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షు, వ్యాధుల నివారణ, వ్యక్తిగత శ్రేయస్సుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చైర్మన్‌ జి. రవీందర్‌రావు మాట్లాడుతూ.. వ్యాధులను ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులతోపాటు వారి కుటుంబ సభ్యులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.


చికిత్సకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో.. వ్యాధుల నివారణకూ అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ అభినవ్‌ గురుకంటి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో సగటు ఆయుర్దాయం పెరిగినా, జీవితంలో చివరి పదేళ్లు అనారోగ్యంతో గడపాల్సి వస్తోందన్నారు. జీవనశైలి వ్యాధులు 30-40 ఏళ్ల వయసులోనే కనిపిస్తుండటం ఆందోళనకరమన్నారు. ఆరోగ్య పరిరక్షణను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. సినీ నటుడు విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యానికి సమయం కేటాయించాలని, సమతుల ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి. సింధు మాట్లాడుతూ.. క్రీడల్లో విజయానికి శారీరక దృఢత్వంతోపాటు మానసిక బలం, క్రమశిక్షణ కీలకమన్నారు.


ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామం, సమతుల ఆహారం, తగినంత విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శారీరక దృఢత్వంతోపాటు మానసిక, భావోద్వేగ సమతుల్యత సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమని హార్ట్‌ఫుల్‌నెస్‌ గ్లోబల్‌ గైడ్‌ కమలేష్‌ డి. పటేల్‌ (దాజీ) పేర్కొన్నారు. ధ్యానం, ప్రశాంతమైన ఆలోచనలు, ఆరోగ్యకరమైన అలవాట్లు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. ఈ సదస్సులో వైద్య, కార్పొరేట్‌, క్రీడా, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ సంస్థల సీఈవోలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 04:48 AM