Share News

హైదరాబాద్‌లో న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన ప్రత్యర్థులు..

ABN , Publish Date - May 23 , 2026 | 11:05 AM

హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో న్యాయవాది ఖాజా మొహియుద్దీన్‌పై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన న్యాయవాదిని దుండగులు కారుతో ఢీకొట్టారు.

హైదరాబాద్‌లో న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన ప్రత్యర్థులు..
Hyderabad Lawyer Attack

హైదరాబాద్, మే 23: మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో న్యాయవాది ఖాజా మొహియుద్దీన్‌పై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. ఈరోజు(శనివారం) ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన న్యాయవాదిని దుండగులు కారుతో బలంగా ఢీకొట్టారు. పక్కా ప్లాన్‌తో న్యాయవాది కోసం వేచి చూస్తున్న దుండగులు.. ఖాజా మొహియుద్దీన్ బయటకు వచ్చిన వెంటనే అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టి పరారయ్యారు. కారు ఢీకొట్టిన వెంటనే న్యాయవాది గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. దీంతో ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు.. మొహియుద్దీన్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. న్యాయవాదిపై హత్యాయత్నం దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.


న్యాయవాదిపై దాడి సమాచారం తెలుసుకున్న తోటి న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాజా మొహియుద్దీన్‌ను కారుతో ఢీకొట్టిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది న్యాయవ్యవస్థపైనే దాడి అని వారు అభివర్ణించారు. ఈ ఘటనపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయవాదిపై దాడికి గల కారణాలు, ఆయనపై ఎవరు దాడి చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఇవి కూడా చదవండి...

నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ

యాదాద్రిలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.100కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2026 | 11:20 AM