చేతికి అందివచ్చిన కొడుకులిద్దరూ పెడదోవ పట్టారనే మనస్తాపంతో..
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:18 PM
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకులు పెడదోవ పట్టడంతో ఆ తల్లి తీవ్ర మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డారు.
హైదరాబాద్, ఆగస్టు 14: నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకులిద్దరూ పెడదోవ పట్టడంతో ఆ తల్లి తీవ్ర మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక కొడుకు తండ్రిని చంపి జైలులో ఉండగా, మరో కొడుకు గంజాయికి బానిసయ్యాడు. ఇలా చేతికి అందివచ్చిన కొడుకులిద్దరూ పెడదోవ పట్టడంతో తట్టుకోలేక పోయిన తల్లి ఆత్మహత్య చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా జన్వాడకు చెందిన తిరుపతి రవీందర్ భార్య సుధ. కేపీహెచ్‌బీ సర్దార్ పటేల్ నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో హౌస్ కీపింగ్‌లో పనిచేస్తున్న సుధ.. అక్కడే ఓ గదిలో నివాసం ఉంటోంది. ఈమెకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు కొన్నేళ్ల కిందట తండ్రిని చంపిన కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అలాగే చిన్న కొడుకు గంజాయికి బానిసై నిత్యం తల్లిని వేధింపులకు గురిచేసేవాడు. దీంతో మనోవేదనకు గురైన సుధ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
విషాదం: విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకు మృతి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
Read Latest Telangana News And Telugu News