మూసీ పేరుతో మూటల వేటకు వ్యతిరేకం: కేటీఆర్
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:37 PM
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్, మార్చి 10: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఈ బడ్జెట్ ద్వారా ఎంత కేటాయించారో బహిర్గతమవుతుందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి 60 శాతం సమయం అయిపోతుందని తెలిపారు. మంగళవారం గండిపేటలో బీఆర్ఎస్ కేడర్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో తాము విశ్లేషణ చేసుకున్నామన్నారు.
అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై సైతం చర్చించామని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం చేసే అంకెల గారడీలపై కూడా విశ్లేషించామని తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ కమిటీలు ఏమీ లేవని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీ నడపాలని లేదని చెప్పారు. అందుకే తూతూ మంత్రంగా ఈ అసెంబ్లీ సమావేశాలను నడుపుతుందంటూ కేటీఆర్ మండిపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మొదట క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిందన్నారు. కానీ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత ఏమైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. ప్రభుత్వంలోని అవినీతి తిమింగలాలను వదిలిపెట్టబోమని కుండబద్దలు కొట్టారు. తిమింగలాల అవినీతిపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. కానీ ఆ పేరుతో మూటల వేటకే తాము వ్యతిరేకమని కేటీఆర్ మండిపడ్డారు.
త్వరలో అసెంబ్లీ సమావేశాలు..
మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని బలంగా తిప్పికొట్టేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. అందుకోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాలు బాహాబాహి.. రంగంలోకి దిగిన పోలీసులు
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..
For More TG News And Telugu News