విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:21 PM
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు పరిశీలించారు.
విజయవాడ, మార్చి 10: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఈ రోజు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. విజయవాడ సిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో తాము ఆకస్మిక తనిఖీ చేశామని చెప్పారు.
టౌన్ ప్లానింగ్‌లోని వివిధ విభాగాల్లో అవినీతి చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదులు వివిధ వేదికల ద్వారా ఏసీబీ దృష్టికి వచ్చిందన్నారు. అంటే.. ప్రజల నుంచి, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు, కథనాలు వచ్చాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదులపై టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకున్నారా? లేదా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ రోజు అంటే.. మంగళవారం ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఫైల్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకుని పరిశీలిస్తున్నామన్నారు. ఏవైనా రూల్స్ డీవియేషన్స్ ఉన్నాయా? అనే విషయాన్ని సైతం ఈ సందర్భంగా పరిశీలిస్తున్నామన్నారు. అన్నింటిని పరిశీలించి.. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు. అక్రమాలు బయటపడితే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సుబ్బారావు హెచ్చరించారు.
ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత ఏసీబీ హెడ్ ఆఫీస్‌కు పూర్తి సమాచారం అందిస్తామన్నారు. అన్ని నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉన్నాయా? లేవా? అనేది ఫీల్డ్‌లోకి సైతం వెళ్లి చూడాల్సి ఉందన్నారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ సుబ్బరావు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఆ సారా తాగితే ఆరోగ్యం.. ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం
Read Latest AP News And Telugu News