ఆ సారా తాగితే ఆరోగ్యం.. ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:36 PM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సారా తాగి 110 ఏళ్ల బతికారని.. కానీ నేడు మద్యం తాగి 80 ఏళ్లు మాత్రమే బతుకుతున్నారన్నారు.
మహబూబ్‌నగర్, మార్చి10: రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇప్ప పువ్వు సారా గురించి చర్చిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జడ్చర్లలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఇప్ప పువ్వు సారాకు 5,000 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తు చేశారు. అది పూర్తిగా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ అని తెలిపారు. ఇప్ప పువ్వు సారా తయారీ వల్ల రాష్ట్రానికి కోట్ల రూపాయిలలో ఆదాయం వస్తుందని వెల్లడించారు. దీనిని ప్రతిపక్ష పార్టీల వారు సైతం అభినందిస్తారని అన్నారు.
గతంలో ఇప్ప పువ్వు సార తాగిన వాళ్లు 115 ఏళ్లు బతికారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కల్తీ బ్రాండ్ల తాగిన వారు కేవలం 60 ఏళ్ళు మాత్రమే బతుకుతున్నారని చెప్పారు. విదేశాలలో అనేక కల్తీ బ్రాండ్లు ఉన్నాయని.. వాటికి మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్టీ సోదరులు ఆర్థికంగా ఎదగాలంటే ఇప్ప పువ్వు సారాకు ప్రాధాన్యత కల్పించాలని తాను ప్రభుత్వాన్ని కోరతానని అన్నారు. తెలంగాణలో ఇప్ప పువ్వు సారతో రూ. లక్ష కోట్ల రెవెన్యూ వచ్చే విధంగా మార్కెట్ ఎక్స్‌పోర్ట్ కూడా చేయవచ్చని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివరించారు.
మరోవైపు సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో విలేకర్లతో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈసారి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సారా దుకాణాలు ప్రారంభించాలని ప్రభుత్వానికి అసెంబ్లీలో విజ్ఞప్తి చేస్తానన్నారు. ఇప్ప పువ్వు సారా సైన్టిఫిక్‌గా ఆరోగ్యానికి హానికరం కాదని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని రాష్టాల్లో సైతం సారా దుకాణాలు ప్రారంభించారని గుర్తు చేశారు. అస్సలు తెలంగాణ రాష్టంలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం
రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు.. బండి సంజయ్ హెచ్చరిక
For More TG News And Telugu News