Share News

మేము సిద్ధం, మీరు సిద్ధమా?: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

ABN , Publish Date - Sep 08 , 2026 | 08:40 AM

కాంగ్రెస్ పార్టీ 1000 పాలన విఫలమైందంటూ ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సోమవారం ఆందోళనలు చేపట్టింది. అసెంబ్లీ వద్ద ఆ పార్టీ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

మేము సిద్ధం, మీరు సిద్ధమా?: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్
BRS working president KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 08: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1000 పాలన విఫలమైందంటూ ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సోమవారం ఆందోళనలు చేపట్టింది. అసెంబ్లీ వద్ద ఆ పార్టీ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.


‘ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమీ సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు’. 420 హామీలు అమలు అవుతాయి అంటే - బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా?’.


‘అలానే మీకు మహిళల పట్ల గౌరవం ఉంటే- నిన్న మా ఎమ్మెల్యేలు సబితక్క, సునీతలకు చీరలు లాగి, మెడ పట్టి గెంటి, కొట్టిన వారిపై ఏమీ చర్యలు తీసుకున్నారో చెప్పండి!’ నిన్న హైకోర్ట్ అంత స్పష్టంగా చెప్పాక కూడా ఈరోజు కావాలని ఫేక్ కేసులు పెట్టి తాతా మధు గారిని, నవీన్ రెడ్డి గారిని అరెస్టులు చేశారంటే మీకు కోర్టులు, చట్టాలు పట్ల ఉన్న గౌరవం అర్థం అవుతుంది. ప్రజలు మీ డైవర్షన్ పాలిటిక్స్‌ను గమనిస్తున్నారు! జై తెలంగాణ’ అని కేటీఆర్ పేర్కొన్నారు.


ప్రతిపక్షం అంటే ఎందుకింత కక్ష, రేవంత్ రెడ్డి గారూ?: హరీశ్ రావు

ఎమ్మెల్సీల అరెస్ట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా , కర్కశంగా గౌరవ శాసన సభ్యులను, మండలి సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించిన పోలీసులే నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు గౌరవ మండలి సభ్యులు తాత మధు, నవీన్ రెడ్డి‌లను అరెస్ట్ చేయడం దురదృష్టకరం. హైకోర్టు చెప్పినా లెక్క చేయకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అంటే చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమే‘.


‘ప్రతిపక్షం అంటే ఎందుకింత కక్ష, రేవంత్ రెడ్డి గారూ? బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి, ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడమే మీ కుట్రా?. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22A భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే ఈ అరెస్టులా?’.


‘మా మహిళా శాసనసభ్యుల చీరలు లాగారు.. గొంతు పిసికారు.. ఈ వికృత చేష్టలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, ఉల్టా మాపైనే కేసులు పెడతారా? అరెస్టులు చేస్తారా?. బీఆర్ఎస్ శాసన సభ్యుల ఇళ్ల ముందు ఎందుకు ఇంత మంది పోలీసులను పెట్టారు? ఎందుకు మా ఇళ్ళను చుట్టు ముట్టారు?. ఖాకీలను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నావు’.


‘ఇది ప్రజాపాలన కాదు.. ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యం!. ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం! @revanth_anumula ఎన్ని అక్రమ కేసులు పెట్టినా BRS గొంతుకను అణచలేరు. ప్రజా సమస్యలపై మా పోరాటం ఆగదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కడుగుతాం’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సీనియర్లు

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం

For More TG News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 09:22 AM