ఏపీకి ప్రశంసలు.. రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన కేటీఆర్
ABN , Publish Date - Jul 15 , 2026 | 09:26 PM
రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఎల్ నినో లాంటి కరువు పరిస్థితుల్లోనూ ఏపీ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. పట్టిసీమ నుంచి రైతులకు నీళ్లు అందిస్తుందని వివరించారు.
న్యూఢిల్లీ, జులై 15: రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఎల్ నినో లాంటి కరువు పరిస్థితుల్లోనూ ఏపీ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. పట్టిసీమ నుంచి రైతులకు నీళ్లు అందిస్తుందని వివరించారు. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కూటమి సర్కారు సాధిస్తుందని పేర్కొన్నారు. తాము 10 నుంచి 15 మంది ఎంపీలను గెలిస్తే కీలకంగా మారతామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు.
కన్నెపల్లి వద్ద రోజుకు మూడు టీఎంసీల నీటిని వాడుకోవచ్చునని కేటీఆర్ చెప్పారు. రోజుకు 28 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల ఎకరాల్లో మాత్రమే ధాన్యం పండేదని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయే నాటికి తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాలలో ధాన్యం పండిందని వివరించారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం రూ.4 వేల కోట్లు మాత్రమే ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినప్పుడు రాష్ట్ర రెవెన్యూ రూ.18,500 కోట్లకు చేరిందని తెలిపారు.
తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆదాయం పెరిగింది.. దీనితోపాటు ఆస్తులు పెరిగాయి.. రాష్ట్ర అప్పు కూడా పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో అప్పులు మాత్రమే పెరిగాయి తప్ప ఆస్తులు పెరగలేదని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది.. ప్రజల ఆదాయం కూడా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ సంస్థకు స్థలం కేటాయిస్తే ఇప్పుడు ఆ సంస్థ చెన్నైకి వెళ్ళిపోయిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వెనకాల సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పారిశ్రామికవేత్తల తలలపై తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారని స్వయంగా మంత్రి కొండ సురేఖ కుమార్తె చెప్పిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
పార్టీ ఓటమిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధికారంలోకి రాకపోవడమే మంచిది అయిందని అన్నారు. తమ కళ్లు నెత్తికెక్కాయని పేర్కొన్నారు. అందుకే మూడోసారి ఓడిపోయామని చెప్పారు. ఓడిపోవడానికి మా తప్పులు కూడా ఉన్నాయని వివరించారు. కొన్ని సెక్టార్లు, వర్గాలను పట్టించుకోలేదని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలను కూడా మార్చి ఉంటే బాగుండేది అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
అవినీతిలో నంబర్ వన్ పొంగులేటి: కేటీఆర్
తెలంగాణలో బ్లాక్, అన్ బ్లాక్ వ్యవస్థ నడుస్తుందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి దోచుకుంటున్నారని ఆరోపించారు. 30 శాతం కమీషన్ ఇస్తేనే అన్ బ్లాక్ చేస్తూ పొంగులేటి, రేవంత్ వాటాలు పంచుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అవినీతిలో నంబర్ వన్ పొంగులేటి అని కేటీఆర్ అభివర్ణించారు.
బండి సంజయ్‌పై ఎలాంటి కోపం లేదు: కేటీఆర్
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని కేటీఆర్ తెలిపారు. ఆయన మా ఎంపీ అని గుర్తు చేశారు. గతంలో ఓ కార్యక్రమంలో ఎదురుపడినప్పుడు ఆయన్ని తాను పలకరించానని కేటీఆర్ వివరించారు. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నేతల కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అందరి మీద ప్రజల దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. ఆయన మీద తనకు సానుభూతి ఉందన్నారు. వివాదం జరిగినప్పుడే రాజీనామా చేసి ఉంటే రాజకీయ నాయకుడిగా బండి సంజయ్‌కి గొప్ప పేరు వచ్చేదని తెలిపారు. అది ముగిసిపోయిన అంశం తాను ఇప్పుడు బండి సంజయ్ రాజీనామా డిమాండ్ చేయడం లేదన్నారు.
సీసీఐని స్క్రాప్‌గా విక్రయించడం దురదృష్టకరం: కేటీఆర్
ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్‌ను వెంటనే పునరుద్ధరించాలని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ నడిచే అవకాశం ఉందన్నారు. 2019లో సీసీఐ తెరిపిస్తామని హోం శాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి కుమారస్వామికి గుర్తు చేశానని తెలిపారు. సీసీఐని స్క్రాప్‌గా విక్రయించడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. సీసీఐ సాధన సమితి పోరాటాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి అభినందించారని చెప్పారు.
సుమారు 2,300 ఎకరాల భూమితో సీసీఐకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. రూ.2,000 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్ ఏర్పాటు సాధ్యమని తెలిపారు. మైనింగ్ లీజు పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం, కేంద్రం చెరో రూ.250 కోట్లు ఇస్తే ప్లాంట్ పునఃప్రారంభం సాధ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సీసీఐ పునరుద్ధరణతో 6,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. సీసీఐ తెరిపించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కుండ బద్ధలు కొట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇచ్చినట్లే సీసీఐకి కూడా ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతుల సాగునీటి సమస్యపై వెంటనే స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. మేడిగడ్డను సాకుగా చూపకుండా కన్నెపల్లి పంపులు ఆన్ చేయాల్సి ఉందన్నారు. రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రాణాలు కాపాడమని వేడుకున్నా పట్టించుకోలేదు.. 40 నిమిషాల నిరీక్షణ చివరికి విషాదం
డ్రగ్స్‌ను అరికట్టేందుకు విద్యాసంస్థల్లో ప్రత్యేక నిఘా.. డీజీపీ ఆదేశాలు
Read Latest TG News And Telugu News