Share News

సాగర్‌ ఆయకట్టుకు నీరివ్వకుంటే ..14 నుంచి పాదయాత్ర

ABN , Publish Date - Sep 04 , 2026 | 07:13 AM

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో నీళ్లున్నా ఆయకట్టు రైతాంగానికి నీరివ్వాలనే సోయి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేకుండా పోయిందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

సాగర్‌ ఆయకట్టుకు నీరివ్వకుంటే ..14 నుంచి పాదయాత్ర
KTR

  • కోదాడ నుంచి హాలియాకు వేలాది రైతులతో నిర్వహిస్తాం

  • దేశమంతా వదిలించుకున్న కాంగ్రెస్‌ దరిద్రం తెలంగాణకు తగులుకుంది

  • మిర్యాలగూడ రైతు మహాధర్నాలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌

  • బీఆర్‌ఎస్‌ ధర్నాకు పోటీగా కాంగ్రెస్‌ ర్యాలీ

నల్లగొండ/ మిర్యాలగూడ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో నీళ్లున్నా ఆయకట్టు రైతాంగానికి నీరివ్వాలనే సోయి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేకుండా పోయిందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన మాట్లాడారు. అంతకుముందు నల్లగొండ జిల్లా కేంద్రంలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన వినాయకచవితి పర్వదినం లోపు నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతుల పక్షాన కోదాడ నుంచి హాలియా వరకు, లేదంటే హాలియా నుంచి కోదాడ వరకు వేలాదిమంది రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు. కృష్ణానీటిని సీఎం రేవంత్‌రెడ్డి.. తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా ఇస్తున్నారని కేటీఆర్‌ దుయ్యబట్టారు. చంద్రబాబును గట్టిగా నిలదీస్తే ఓటుకు నోటు కేసు మెడకు చుట్టుకుంటుందని భయపడిన రేవంత్‌రెడ్డి.. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపును అడ్డుకోవడంలేదని ఆరోపించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనూ సాగర్‌ నీటి విడుదల అంశాన్ని లేవనెత్తుతామని కేటీఆర్‌ తెలిపారు. రైతు డిక్లరేషన్‌ పేరుతో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేశమంతా వదిలించుకున్న దరిద్రపు కాంగ్రెస్‌ తెలంగాణకు తగులుకుందని విమర్శించారు. మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో ఏనాడూ సాగర్‌లో ఎడమకాల్వకు నీరివ్వకుండా కుడికాల్వకు నీటి విడుదల చేయలేదని, ఇప్పుడు ఎడమకాల్వను ఎండబెట్టి కుడికాల్వకు నీరిస్తున్నారని విమర్శించారు. ఆయకట్టుకు నీళ్లివ్వకపోవటంతో వేలమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తెలిపారు. ధర్నాలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌, గాదరి కిషోర్‌కుమార్‌, విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కేటీఆర్‌ రాజకీయ నాటకం: లక్ష్మారెడి

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతుల సమస్యలను పట్టించుకోకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కేటీఆర్‌ .. రైతు మహాధర్నా పేరుతో రాజకీయ నాటకానికి తెరతీశారని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ రైతు మహాధర్నాకు వ్యతిరేకంగా మిర్యాలగూడలో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్‌ చౌరస్తా వద్ద ఽరోడ్డుపై బైఠాయించి గోబ్యాక్‌ కేటీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పదేళ్లపాలనలో రైతు సంక్షేమం కోసం ఏం చేశారో కేటీఆర్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. రెండు పార్టీల ర్యాలీలు ఎన్నెస్పీ క్యాంపు గ్రౌండ్‌ వైపు దూసుకురావటంతో అప్రమత్తమైన పోలీసులు.. ఇరువర్గాలు ఎదురుపడకుండా దారి మళ్లించారు.


వచ్చే ఏడాది కేసీఆర్‌ బస్సు యాత్ర

రాబోయే రెండేళ్లు తమ పార్టీ కార్యక్రమాల వేగం పెంచుతామని కేటీఆర్‌ తెలిపారు. నల్లగొండలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేపడతామని చెప్పారు. 2027 మార్చి, ఏప్రిల్‌ నుంచి తన పాదయాత్ర ఉంటుందని, ఆ తరువాత కేసీఆర్‌ బస్సు యాత్ర చేసే యోచనలో ఉన్నారని వెల్లడించారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ఏపీ, తెలంగాణలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలు పెంచక తప్పదని, ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నట్టు సమాచారం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యే ఉండబోతుందని, బీజేపీ ప్రభావం అంతగా ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళ సంఘాల సభ్యులకు ఈ కేవైసీ

దోస్తీకే గులామ్‌ని

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 07:13 AM