తెలంగాణలో రాజకీయ సెగలు.. రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు..
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:53 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని, ప్రభుత్వ చర్యలను ఎక్కడికక్కడ ఖండించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు (KCR) సిట్ (SIT) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈకేసుపై అధికారులు విచారణకు సిద్ధమవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) తెలంగాణ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. కేసీఆర్‌కి సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ రేపు (ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
భారీ యాక్షన్ ప్లాన్..
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ, నియోజకవర్గ కేంద్రాల్లో నల్ల జెండాలతో నిరసన తెలపాలని, బైక్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ముఖ్య కూడళ్లలో ధర్నాలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
‘శాంతియుతంగా నిరసనలు’
ఆందోళనలు తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎక్కడా పోలీసులతో ఘర్షణలకు దిగొద్దని, శాంతియుత పద్ధతిలోనే నిరసన చేపట్టాలని నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సిట్ నోటీసులు కేవలం రాజకీయ వేధింపులేనని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..
మరోవైపు, హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం, తెలంగాణ భవన్‌కు జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కేసీఆర్ విచారణకు హాజరవుతున్న సమయంలోనే ఈ నిరసనలు జరగడం చూస్తుంటే.. బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకోవాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య 'బల ప్రదర్శన'గా మారే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
Read Latest Telangana News And AP News And Telugu News