ఆ కంపెనీలో రేవంత్ బినామీ పెట్టుబడులు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:00 PM
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ.. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని ఆరోపించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేఎల్ఎస్ఆర్‌కు అప్పగించారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Former Minister KTR) తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్కాములను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నామని, మూసీ నది పేరిట లక్షల కోట్ల దోపిడీని బీఆర్ఎస్ అడ్డుకుందని అన్నారు. లగచర్లలో అల్లుడి కంపెనీ కోసం గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తే బీఆర్ఎస్ అడ్డుకుందని, హిల్ట్ పాలసీలో లక్షల కోట్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిందని చెప్పారు. అలాగే, సింగరేణి అవినీతినీ తమ పార్టీ బయటపెట్టిందని కేటీఆర్ వెల్లడించారు.
కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీగా కేటీఆర్ అభివర్ణించారు. జనవరి 23న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కేఎల్ఎస్ఆర్‌పై సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని, దివాళా తీసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని ఆయన చెప్పారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు రూ.6 వేల కోట్ల టెండర్లు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి బినామీ చీఫ్ మినిస్టర్ అని, ఆయన్ను వెనుక నుంచి వేరే వాళ్లు నడిపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేఎల్ఎస్ఆర్‌కు అప్పగించారని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డిపై గతంలో రైడ్స్ జరిగితే అందులో కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసిందన్నారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీలో రేవంత్ రెడ్డి బినామీ పెట్టుబడులు ఉన్నాయని 2018లోనే ఐటీ చెప్పిందని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి సీఎం కాగానే కేఎల్ఎస్ఆర్‌కు రెక్కలు వచ్చాయన్నారు కేటీఆర్. మెదక్‌లో ఆర్ అండ్ బి వర్క్స్, షాద్‌నగర్ పరిగి రోడ్, ఇరిగేషన్ వర్క్స్ ఇచ్చారని కేటీఆర్ అన్నారు. 2023 జులై నుంచి కేఎల్ఎస్ఆర్ కంపెనీ దివాళా తీసిందని ఆయన చెప్పారు. బినామీ బాగోతం బయటకు రాకుండా ఉండటం కోసం దావోస్ నుంచి బాగోతం నడిపారని మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. కేఎల్ఎస్ఆర్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దావోస్‌లో సీఎం మాయమయ్యారనే వార్తలు వచ్చాయన్నారు. బినామీ బాగోతాలు చక్కబెట్టుకోవడం కోసమే ముఖ్యమంత్రి మాయమయ్యారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ నుంచి రేవంత్ రెడ్డి కుటుంబీకులకు చెందిన కంపెనీలకు డబ్బులు బదిలీ అయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు కామెడీ సీరియల్ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గాంధారి ప్రసాద్ కుమార్‌గా మారారని ఆయన విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు స్వయంగా సీఎం కండువా కప్పారని తెలిపారు. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
నా భార్య, పిల్లలు ఎందుకు చనిపోయారో తెలియడం లేదు: సురేందర్ రెడ్డి ఆవేదన
నాన్న ఆదేశాలతో అన్ని రకాల సేవలూ అందిస్తున్నాం: బాలకృష్ణ
Read Latest Telangana News And Telugu News