రాజీనామాకే మొగ్గు!
ABN , Publish Date - Sep 02 , 2026 | 03:39 AM
కొండా సురేఖతో మంత్రిపదవికి రాజీనామా చేయించడానికే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఆమె భవిష్యత్తుకు భరోసా ఇచ్చి రాజీనామా చేయించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు చెబుతున్నారు.
అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి కొండా సురేఖ
సంప్రదింపులు
ప్రారంభించిన కేసీ వేణుగోపాల్
మొదట సీఎం రేవంత్‌తో
గంటపాటు చర్చలు
నేడు మీనాక్షి, మహేశ్‌లతో భేటీ
డిప్యూటీ సీఎం భట్టి
అభిప్రాయమూ తీసుకొనే చాన్స్
పునర్వ్యవస్థీకరణపై అస్పష్టత
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కొండా సురేఖతో మంత్రిపదవికి రాజీనామా చేయించడానికే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఆమె భవిష్యత్తుకు భరోసా ఇచ్చి రాజీనామా చేయించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అధిష్ఠానం రాజీనామాను ప్రతిపాదిస్తే దానికి కొండా సురేఖ అంగీకరిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అంగీకరించని పక్షంలో ఆమెను మంత్రి వర్గం నుంచి తప్పించడమే పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న ఏకైక మార్గమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలతో పాటుగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపైనా ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చేపట్టిన సంప్రదింపుల ప్రక్రియ పూర్తయితే గానీ దీనిపై స్పష్టత రాదని చెబుతున్నారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన కేసీ వేణుగోపాల్ పార్టీ తెలంగాణ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. సంప్రదింపుల ప్రక్రియను ముఖ్యమంత్రితోనే మొదలుపెట్టారు. మంగళవారం ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన గంటకు పైగా చర్చలు జరిపారు. ఈ భేటీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ, కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తదితరాలపై సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయాలను ఆయన నమోదు చేసుకున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ లైన్ దాటి వ్యవహరిస్తున్న నేతలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి నివేదించినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కొండా సురేఖతోపాటు మరికొందరి వ్యవహార శైలికి సంబంధించిన నివేదికలు, మంత్రుల శాఖల వారీ పనితీరు రిపోర్టును ముఖ్యమంత్రి అధిష్ఠానానికి అందజేసినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, సురేఖ అంశంలో అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయానికి తాను కట్టుబటి ఉంటానని కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌లతో భేటీ కానున్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలతో పాటుగా ఇతర అంశాలపైనా వారి అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్ తీసుకోనున్నారు. అలాగే ఢిల్లీలో వైఎస్ఆర్ అవార్డు ప్రదానం కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి శ్రీథర్‌బాబులు బుధవారం ఉదయం ఢిల్లీకి వస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోనూ కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయితే గానీ కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది స్పష్టతవస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కొండా సురేఖకు పిలుపు!
అధిష్ఠానం పిలుపు మేరకు మంత్రి కొండా సురేఖా మంగళవారం ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో ఆమె కేసీ వేణుగోపాల్‌తో పాటుగా అధిష్ఠానం పెద్దలనూ కలవనున్నట్లు చెబుతున్నారు. కేసీ వేణుగోపాల్ సంప్రదింపుల అనంతరం రాజీనామా చేయించాలన్న నిర్ణయాకి వస్తే భవిష్యత్తు గురించి పార్టీ పెద్దలతో భరోసా ఇప్పించేందుకే ఢిల్లీకి పిలిపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ ప్రక్రియను ముగించేందుకే అధిష్ఠానం సంప్రదింపులను చేపట్టిందని చెబుతున్నారు.
పునర్ వ్యవస్థీకరణపై అస్పష్టత!
సీఎం రేవంత్‌రెడ్డి సహా పార్టీ ముఖ్య నాయకులంతా ఢిల్లీకి చేరుకోవడంతో కొండా సురేఖపై చర్యలు తీసుకోవడంలో భాగంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణనూ చేపట్టవచ్చునన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీంతో ఆశావహులు ఢిల్లీకి పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అధిష్ఠానం పెద్దల వద్ద తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొండా సురేఖ అంశాన్ని, పునర్ వ్యవస్థీకరణను అధిష్ఠానం వేర్వేరుగా చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో పునర్ వ్యవస్థీకరణను ఇప్పుడే చేపడుతుందా? లేదా అన్నది స్పష్టత లేదు. సంప్రదింపుల ప్రక్రియ ముగిస్తేనే గానీ దీనిపైన స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఖర్గేతో స్పీకర్ భేటీ
కాగా, పార్లమెంట్ కమిటీ సమావేశం నిమిత్తం ఢిల్లీ వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని స్పీకర్ ఈ సందర్భంగా కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వచ్చారు. బుధవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో స్వామినాథన్ ఫౌండేషన్ నిర్వహించే వైఎస్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకే పలువురు మంత్రులు వస్తున్నారు.
అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే
క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా తన నివేదికను అందజేశానని, ఇక అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని ఎంపీ మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై సమగ్రంగా పరిశీలించి ఇప్పటికే నివేదిక ఇచ్చానని, పార్టీ అంతర్గత నివేదికలోని సున్నితమైన అంశాలను బహిరంగంగా మీడియా ముందుకు వెల్లడించలేనని తెలిపారు. పార్టీలో క్రమశిక్షణే ప్రాథమిక సూత్రమని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నివేదికలో స్పష్టంగా సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
152 మీటర్లకు సమ్మతి తెలపండి
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఊరట