Share News

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఊరట

ABN , Publish Date - Sep 02 , 2026 | 03:11 AM

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో భారీ ఊరట లభించింది. హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి ఆయనను తొలగించాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది.

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఊరట
Ranganath

  • ఆయన్ను కమిషనర్‌ పదవి నుంచి తప్పించాలన్న సింగిల్‌ జడ్జి

  • ఉత్తర్వుల్ని సస్పెండ్‌ చేసిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

  • తదుపరి విచారణ నవంబరు 3వ తేదీకి వాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో భారీ ఊరట లభించింది. హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి ఆయనను తొలగించాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది. రంగనాథ్‌ కోర్టు తీర్పును ఉల్లంఘించి.. శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన భూమిలోకి వెళ్లారని హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు కాగా, దాన్ని విచారించిన న్యాయమూర్తి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని సీఎ్‌సకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను రంగనాథ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేశారు. ఆయన పిటిషన్‌పై జస్టిస్‌ శ్యాంకోషీ, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రంగనాథ్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ రాజీవ్‌ శక్దర్‌ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ‘హైకోర్టు ఉత్తర్వులను నేను (హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌) ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదు. ప్రభుత్వ భూమిని రక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లాను. అక్కడ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి కోర్టు ధిక్కరణకూ పాల్పడలేదు. దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇచ్చే అవకాశం సింగిల్‌ జడ్జి వద్ద లభించలేదు. అదనపు కౌంటర్‌ దాఖలు చేస్తామని.. సమయం ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. వేగంగా కోర్టు ధిక్కరణ కేసును విచారించి.. నన్ను పదవి నుంచి తొలగించాలనడం తీవ్రమైన శిక్ష. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్ట్స్‌ యాక్ట్‌లో నిర్దేశించిన శిక్షను మించి అధిక శిక్ష విధించే అధికారం సింగిల్‌ జడ్జికి లేదు. కమిషనర్‌ పదవి నుంచి నన్ను తప్పించడం సాధారణ బదిలీ కిందికి రాదు. అది తీవ్ర శిక్షగా మారి నా కెరీర్‌పై ప్రభావం చూపడంతోపాటు సర్వీసు రికార్డుల్లో మాయని మచ్చగా మిగిలిపోతుంది’ అని పేర్కొన్నారు. శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ తరఫు న్యాయవాది వాదిస్తూ.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి శిక్షా లేదని.. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సస్పెండ్‌ చేసింది. తదుపరి విచారణను నవంబరు 3కి వాయిదా వేసింది.


అబార్షన్‌ కిట్ల అమ్మకాలపై వివరణ కోరిన హైకోర్టు

అబార్షన్‌ కిట్ల విచ్చలవిడి అమ్మకాలపై వివరణ ఇవ్వాలని వైద్యఆరోగ్యశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. డాక్టర్ల సలహా లేకుండా అబార్షన్‌ కిట్ల అమ్మకాలతో.. వాటిని వాడేవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు వైద్యఆరోగ్యశాఖ వివరణ కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి

కల్యాణలక్ష్మికి హైకోర్టు పచ్చజెండా

ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ దండయాత్ర

Updated Date - Sep 02 , 2026 | 03:11 AM