Share News

ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ దండయాత్ర

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:50 AM

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను వారధిగా మార్చుకొని గులాబీ దండు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సన్నద్ధమైంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ మొదలుపెట్టింది.

ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ దండయాత్ర

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను వారధిగా మార్చుకొని గులాబీ దండు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సన్నద్ధమైంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ మొదలుపెట్టింది. ఇందుకోసం ఈనెల 8వ తేదీ వరకు కార్యాచరణ రూపొందించింది. ఏడు రోజులపాటు జరిగే వివిధ కార్యక్రమాల కోసం మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం, తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్‌స్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు నేతృత్వంలో ఉద్యమ కార్యాచరణలో ముందుకు సాగే విధంగా వివిధ మండలాల ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో సిరిసిల్ల నుంచి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తుండగా, వేములవాడలోనూ బీఆర్‌ఎస్‌కు పట్టు ఉంది. ఈక్రమంలో జిల్లాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను ప్రజలకు గుర్తు చేసే విధంగా ముందుకు వెళ్లనున్నారు. ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలుతీరు, ఆడపడుచు పెళ్లికి తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, మహిళకు రూ.2500, ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఏర్పడిన స్తబ్దతతో తొలగించి నాయకుల్లో ఉత్సాహం నింపే దిశగా ఊరురా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మరోసారి పూర్వవైభవం వచ్చే విధంగా కసరత్తు ప్రారంభించారు.

ఏడు రోజుల కార్యక్రమాలు ఇవీ..

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రకటించి ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై దండయాత్ర సాగించే విధంగా ఏడు రోజుల కార్యక్రమం రూపకల్పన చేశారు. ఇందుకోసం మంగళవారం జిల్లా కేంద్రంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి బాకీ కార్డు, బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. బుధవారం 2వ తేదీన సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఆరు గారెంటీల వైఫల్యాలపై చార్జ్‌షీట్‌లో బాకీ కార్డుల పంపిణీ, 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన, ధర్నాలు నిర్వహిస్తారు. 3వ తేదీన వ్వవసాయ విధ్వంసం, 22ఏ నిషేధితలో భూముల కోసం చార్జ్‌షీట్‌లో వ్వసాయం, నీటీపారుదల రంగం, యూరియా, రైతు బీమా కోసం రైతు సదస్సులు, సిరిసిల్ల మున్సిపాలిటీ ఏరియాలో ధర్నాలు, 4వ తేదీన వృద్ధులు, వికలాంగులు, మహిళలతో సదస్సులు నిర్వహిస్తారు. మహిళకు రూ 2500, కేసీఆర్‌ కిట్‌, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వని ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు నిర్వహిస్తారు. 5వ తేదీన విద్యార్థులు, యువతతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జాబ్‌ క్యాలెండర్స్‌, యూత్‌ డిక్లరేషన్‌ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపడతారు. 6వ తేదీన పల్లెల విధ్వంసం, పడకేసిన పారిశుధ్వానికి నిరసనగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు, 7వ తేదీన జిల్లా, మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించి 420 హామీల అమలుపై వినతిపత్రాలు స్వీకరిస్తారు. చివరి రోజు 8వ తేదీన జిల్లా కేంద్రంలో ఏడు రోజుల కార్యక్రమాలపై ప్రెస్‌మీట్‌, అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు చేపడతారు. దీంతోపాటు సెప్టెంబరు 10న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం కూడా తెలపనున్నారు. ఏడు రోజుల కార్యక్రమంపై వచ్చే స్పందనను బట్టి భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని బావిస్తున్నారు.

ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ..

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలు వైఫల్యాలపైనే బీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల గ్యారెంటీ ప్రకారం ఇవ్వాల్సిన కాంగ్రెస్‌ బాకీ కార్డు అంటూ 12 అంశాలపై ముద్రించిన కార్డులను ప్రతి ఇంటికి పంపిణీ చేయడానికి నిర్ణయించారు. బాకీ కార్డులో మహిళలకు నెలకు రూ.2500 హామీ ప్రకారం 33 నెలలకు రూ.82500 బాకీ ఉందని, వృద్ధులు, బీడీ కార్మికులకు పెన్షన్‌ నెలకు రుణాలు హామీలకు రూ.66వేల బాకీ, దివ్యాంగుల పెన్షన్లు రూ.66వేల బాకీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీ బాకీ, విద్యార్థులకు ఫీజు బకాయిలు రూ.12వేలకోట్ల బాకీ, రైతు భరోసాలో రూ.1,02,000 బాకీ, రుణమాఫీలో రూ.2 లక్షల బాకీపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వరి పంట రూ.500 బోనస్‌, ప్రతి ఎకరానికి రూ.12,500 హామీ ఆరు పంటలకు, ఉపాధిహామీ రైతు కూలీలకు రూ.24 వేలు, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు బాకీ, నిరుద్యోగ భృతిలో రూ.1.32 లక్షల బాకీ, విద్య భరోసా కార్డు ద్వారా విద్యార్థులకు రూ.5 లక్షల బాకీ, ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12వేల చొప్పున రూ.24వేలకు సంబంధించిన బాకీ కార్డులను ప్రజలకు అందించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండబెట్టడానికి బీఆర్‌ఎస్‌ పూనుకుంది.

వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం..

- తోట ఆగయ్య జిల్లా అధ్యక్షుడు బీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 42హామీల వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్తాం. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2500 హామీ, నిరుద్యోగ భృతి.. ఇలా అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్‌ మోసాలను ప్రజల ముందుంచి హామీల అమలకు ప్రభుత్వం దిగి వచ్చేవరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.

కాంగ్రెస్‌ పాలనలో మోసపోయారు

- కొండూరు రవీందర్‌రావు నాస్కాబ్‌ చైర్మన్‌

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో గ్యారంటీలు, హామీల మధ్య ప్రతి ఒక్కరు మోసపోయారు. కాంగ్రెస్‌ వెయ్యి రోజులు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రజల్లోకి కాంగ్రెస్‌ వైఫల్యాలు, మోసాలను తీసుకెళ్లి చైతన్య పరుస్తాం. హామీలు అమలు చేసే వరకు ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌ శ్రేణుగా ఆందోళనలు కొనసాగిస్తాం.

Updated Date - Sep 02 , 2026 | 12:50 AM