కల్యాణలక్ష్మికి హైకోర్టు పచ్చజెండా
ABN , Publish Date - Sep 02 , 2026 | 02:55 AM
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు హైకోర్టు డివిజన్ బెంచ్ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఏకసభ్య ధర్మాసనం ఇటీవల ఇచ్చిన స్టే ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఏకసభ్య ధర్మాసనం విధించిన స్టేను
నిలిపివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
సంక్షేమ పథకాల అమలు
రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం: ఏజీ
ఇవ్వాల్సిన వాళ్లకు నిధులివ్వకుండా
ఉచితాలకు పంచుతున్నారు: పిటిషనర్
కాగ్ ఏమైనా అభ్యంతరం తెలిపిందా?
పిటిషనర్‌కు ధర్మాసనం ప్రశ్న
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు హైకోర్టు డివిజన్ బెంచ్ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఏకసభ్య ధర్మాసనం ఇటీవల ఇచ్చిన స్టే ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఈ పథకాలు యథావిధిగా మళ్లీ అమల్లోకి వచ్చాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు సంబంధించిన ఏడు జీవోలపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతులకు.. వివాహానికి సంబంధించిన ఆర్థికభారం తగ్గించేందుకు ఈ పథకాలను తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. పురుషుడైన పిటిషనర్‌కు వీటి వల్ల ఎలాంటి లాభం లేదా నష్టం లేదని.. అతడి హక్కులకు భంగం వాటిల్లటం లేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు ఆయా రాష్ట్రాల విచక్షణాధికారమని చెప్పారు. న్యాయవాదిగా సైతం ఉన్న పిటిషనర్.. వ్యక్తిగత హోదా (పార్టీ ఇన్‌పర్సన్)లో ఈ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. పిటిషనర్ విజయ్ గోపాల్ వాదిస్తూ.. ఎలాంటి చట్టం లేకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల (జీవోల) ద్వారా ఈ పథకాలు అమలు చేయడం చెల్లదన్నారు. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయినవారు, పింఛనుదారులు తదితరులకు చట్టబద్ధంగా, హక్కుగా అందించాల్సిన డబ్బులకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు, ఉచిత పథకాలకు నిధులు మంజూరు చేస్తోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘ఎలాంటి చట్టం లేకుండా, రాజ్యాంగబద్ధమైన అనుమతి లేకుండా ఈ పథకాలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని కాగ్ ఏమైనా నివేదిక ఇచ్చిందా?’ అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ సరైన సమాధానం చెప్పకపోవడంతో.. సింగిల్ జడ్జి విధించిన స్టేను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
విచ్చలవిడిగా ప్రిస్ర్కిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయాలు
ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ దండయాత్ర