విచ్చలవిడిగా ప్రిస్ర్కిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయాలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:52 AM
- మూడు రోజుల క్రితం కరీంనగర్ బ్యాంక్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా మాత్రలను విక్రయించిన మెడికల్ స్టోర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
501కేఎన్‌ఆర్01
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్/సుభాష్‌నగర్ )
- మూడు రోజుల క్రితం కరీంనగర్ బ్యాంక్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా మాత్రలను విక్రయించిన మెడికల్ స్టోర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యుడి సూచనలు లేకుండానే విక్రయుంచిన ఈ మాత్రలను నీళ్లల్లో కలుపుకొని సిరంజీ ద్వారా ఒంట్లోకి ఎక్కించుకుని యువత మత్తుకు బాసిసవుతున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో మెడికల్ దందా ఇంతకింతకు పెరుగుతోంది. పైకి నిబంధనల ప్రకారమే అమ్మకాలు జరుగుతున్నట్లు కనిపించినా లోలోపల మాత్రం తెలియని అక్రమ తంతంగాలు నడుస్తూనే ఉన్నాయి. పుట్టగొడుగుల్లా గల్లీకొకటిగా పుటుకొస్తున్న మెడికల్‌షాప్‌లలో మందుల విక్రయాల విషయంలో సరైన పర్యవేక్షణ కనిపించడం లేదు. ’తాము అమ్మినదే మాత్ర.. ఇచ్చినదే ఆయింట్‌మెంట్’.. అనే విధంగా అమ్మకాల్లో గోల్‌మాల్ వ్యవహారాలే నడుస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. అనర్హుల చేతుల్లో కొన్ని దుకాణాలు నడుస్తున్నాయి. మెడికల్ వ్యాపారంలో పెరిగిన పోటీ దృష్ట్యా దుకాణంలోకి వెళ్లి ఏ మందు అడిగినా ఇట్టే ఇచ్చేస్తున్నారు. ఎందుకు వాడుతున్నారనే విచారణలే చేయడం లేదు. పైగా వైద్యుల మాదిరిగా రోగి రుగ్మతను తెలుసుకుని మాత్రలు, సిరఫ్‌లు ఇచ్చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం మాత్రలను అంటగడుతున్నారు. ఇక ఒక ఫార్ములా స్థానంలో మరొకటి ఇస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ విధంగా విక్రయాలు సాగిస్తున్నా పట్టించుకుని చర్యలు తీసుకుంటున్న దాఖలాలు జిల్లాలో కనిపించడం లేదు.
ఫ అందరిదీ అదే దారి...
జిల్లావ్యాప్తంగా దాదాపుగా 950కిపైగా మెడికల్ దుకాణాలుండగా అందులో వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలోనే దుకాణాలు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయి. 95శాతం దుకాణాల్లో వైద్యులు ప్రిస్ర్కిప్షన్ లేకుండానే జలుబు, జ్వరం, గొంతు నొప్పి.. ఇతర ఏ ఇబ్బందులకైనా ఔషధాల్ని ఇచ్చేస్తున్నారు. వాటిని ఎలా ఉపయోగించాలనే ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. వైద్యుడి వద్దకు వెళ్లి అక్కడ డాక్టర్ కన్సల్టెన్స్ ఫీజు చెల్లించే డబ్బులతోనే ఇక్కడ దుకాణాల్లో మందులొస్తున్నాయనే ఉద్దేశంతో ప్రజలు ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. నేరుగా దుకాణాలకు వెళ్లి యథేచ్ఛగా కొనుగోలు చేస్తున్నారు. ఇలా తీసుకోవడం తప్పని చెప్పేవారు లేకపోవడం, పర్యవేక్షణ అధికారులు ప్రజలకు అవగాహన పెంచకపోవడంతో ఈ సమస్య ఇంతకింతకు పెరుగుతోంది. వీరి వ్యాపారాలపై దృష్టి పెట్టాల్సిన ఔషధ నియంత్రణ(డ్రగ్ కంట్రోలర్) అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫ ముప్పని తెలిసినా అదే తప్పు..
ఎట్టిపరిస్థితుల్లో ఔషధాలను వైద్యుడి చీటి లేనిది ఇవ్వకూడదనే ప్రాథమిక సూత్రాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. గతంలో ఒక మాత్ర బదులు ఇంకొకటి ఇచ్చి ఇబ్బందులు పడిన ఉదంతాలు జిల్లాలో ఉన్నాయి. దీంతోపాటు చాలా దుకాణాల్లో ఫార్మసిస్ట్‌లు లేరు. నిబంధనల ప్రకారం మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్‌లు డ్రస్‌కోడ్‌ను పాటిస్తూ కొనుగోలుదారులకు సేవలందించాలి. బీ-ఫార్మసీ, డీ-ఫార్మసీ సర్టిఫికెట్ ఉన్న వారు వీటిని నిర్వహించాలి. చాలామంది వేరే వారి పేరిట ఉన్న సర్టిఫికెట్‌తో దుకాణాలు నడుపుతూ సదరు సర్టిఫికేట్ ఉన్న వారికి నెలకు కొంత మొత్తం ముట్టచెబుతున్నారు. జిల్లాలో అనుభవం ప్రాతిపదికన వ్యాపారాలు సాగిస్తున్న మెడికల్ దుకాణదారులే ఎక్కువ ఉన్నారు. అందులో పనిచేసే వారిలో ఎక్కువ మందికి తగిన విద్యార్హతలు లేనేలేవు. మరోవైపు అమ్మిన ప్రతీ మాత్రకు సంబంధించి రసీదును ఇవ్వాలి. ఒక్కచోట కూడా రసీదులు ఇవ్వడం లేదు. ఏ దుకాణంలో ఎంత వ్యాపారాలను సాగించారనే లెక్కాపత్రం లేని తీరున కొందరు ఈ వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక మెడికల్ దుకాణాన్ని నిర్వహించడానికి అనుమతి లేకుండా కూడా కొన్ని దుకాణాలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. ఒకే అనుమతితో రెండు చోట్ల వ్యాపారాల్ని సాగిస్తున్నవారూ ఉన్నారు. గ్రామీణ పారంతాల్లోనూ ఇబ్బడిముబ్బడిగా మెడికల్ దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. వీటిన్నింటిపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే విధంగా పర్యవేక్షణను సంబంధిత అధికారులు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.