152 మీటర్లకు సమ్మతి తెలపండి
ABN , Publish Date - Sep 02 , 2026 | 03:26 AM
తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి అనుమతించాలని కేంద్ర జలవనరుల సంఘాన్ని (సీడబ్ల్యూసీని) తెలంగాణ కోరింది. 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచడం వల్ల అదనంగా ఏర్పడే ముంపు చాలా స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది.
‘తుమ్మిడిహెట్టి’ నిర్మాణానికి అనుమతి ఇప్పించండి
148 మీటర్లకు 152కు
ముంపులో పెద్దగా తేడా ఉండదు
మహారాష్ట్ర ప్రాజెక్టులపై ఎటువంటి ప్రభావం ఉండబోదు
కేంద్ర జలవనరుల సంఘం
సమావేశంలో తెలంగాణ వాదన
ముంపుపై సంయుక్త
సర్వే చేద్దామని మహారాష్ట్రకు సూచన
మరోసారి భేటీకి సీడబ్ల్యూసీ నిర్ణయం
స్వల్ప తేడాను సాంకేతిక
చర్యల ద్వారా పరిష్కరించవచ్చు
సీడబ్ల్యూసీ భేటీలో తెలంగాణ వాదన
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి అనుమతించాలని కేంద్ర జలవనరుల సంఘాన్ని (సీడబ్ల్యూసీని) తెలంగాణ కోరింది. 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచడం వల్ల అదనంగా ఏర్పడే ముంపు చాలా స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. దీనిని తగినసాంకేతిక చర్యలు, రక్షణ చర్యల ద్వారా పరిష్కరించవచ్చని తెలిపింది. మంగళవారం న్యూఢిల్లీలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ తరఫున నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ (జనరల్) ఓ.వి.రమేశ్‌బాబుతోపాటు మహారాష్ట్ర నుంచి ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇద్ద రు కీలక అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భం గా తెలంగాణ అధికారులు తమ వాదన వినిపిస్తూ.. ‘‘తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో కడితే 3,715 ఎకరాలు ముంపు ఉంటుంది. అందులో నదీగర్భం 2,772 ఎకరాలు, చాప్రాల ఎకో సెన్సిటివ్ జోన్‌లో 728 ఎకరాల ముంపు ఉండనుండగా.. 215 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉంటుం ది. మొత్తం 3,715 ఎకరాల్లో సేకరించాల్సిన భూమి 215 ఎకరాలు మాత్రమే. అదే 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 5,325 ఎకరాల నదీ గర్భం, 1,345 ఎకరాల ఎకో సెన్సిటివ్ జోన్ ముంపునకు గురికానుండగా.. 2,898 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది’’ అని గుర్తు చేశారు. బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో కట్టుకోవడానికి అనుమతి ఇప్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గత జూన్ 11న సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖ నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే.. మహారాష్ట్రలో ముంపు తీవ్రంగా ఉంటుందనే వాదనలను ఆ రాష్ట్ర అఽధికారులు వినిపించగా.. తెలంగాణ అధికారులు పైవిధంగా వివరణ ఇచ్చారు.
వారంలోపు నివేదికలు అందజేస్తాం..
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో ఏర్పడే ముంపుపై కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్-పుణె), ఆర్వీ అసోసియేట్స్ సర్వే చేశాయని తెలంగాణ గుర్తు చేయగా.. ఆ నివేదికలు అందించాలని మహారాష్ట్ర కోరింది. దాంతో వారం రోజుల్లోపు నివేదికలు అందిస్తామని తెలంగాణ తెలిపింది. బ్యారేజీ నిర్మాణంతో తమ రాష్ట్రంలో ఎగువన, దిగువన ప్రాజెక్టుల నీటి లభ్యతపై ప్రభావం ఉంటుందా? అని మహారాష్ట్ర అధికారులు ప్రస్తావించగా.. ఇప్పటికే మహారాష్ట్ర-తెలంగాణ మధ్య సంయుక్త ప్రాజెక్టులు ఉన్నాయని, చనాకా కొరాటా, లెండి ప్రాజెక్టులే ఇందుకు ఉదాహరణ అని తెలంగాణ పేర్కొంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ వల్ల మహారాష్ట్రలోని ప్రాజెక్టులపై ఎటువంటి ప్రభావం పడదని స్పష్టం చేసింది. అలాగే ఎగువ, దిగువ ప్రాం తాల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం అవసరమైన సాంకేతిక, నిర్వహణపరమైన రక్షణ చర్యలను రూపొందించి సంబంధిత అధికారుల ముందు ఉంచుతామని చెప్పింది. ముంపుపై సంయుక్త సర్వే చేద్దామని తెలంగాణ అధికారులు ప్రతిపాదించారు.
205 టీఎంసీల నీటి లభ్యత
తుమ్మిడిహెట్టి వద్ద 205 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలంగాణ అధికారులు గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి బచావత్ ట్రైబ్యునల్‌తోపాటు పలు అధ్యయనాలు ఉన్నాయని తెలిపారు. సీడబ్ల్యూసీ గతంలో చేసిన అఽధ్యయనాల ప్రకారం 75ు డిపెండబిలిటీ ఆధారంగా తుమ్మిడిహెట్టి వద్ద 205.8 టీఎంసీల నీటి లభ్యత ఉందని పేర్కొన్నారు. అయితే బ్యారేజీల నిర్మాణ ప్రదేశంలో 165.38 టీఎంసీల నీటిలభ్యత ఉందని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి పథకాన్ని 165 టీఎంసీలతో చేపట్టగా.. 2015 ఫిబ్రవరి 13న హైడ్రాలజీ అనుమతి లభించిందన్నారు. ఇరిగేషన్ ప్లానింగ్, అంతర్రాష్ట్ర క్లియరెన్స్, సెంట్రల్ సాయింట్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, కన్‌స్ట్రక్షన్ మిషనరీ కన్సలెన్సీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ అనుమతులు వచ్చాయని వివరించారు. పర్యావరణ అనుమతి కోసం తెలంగాణలో 2011 ఏప్రిల్‌లో బహిరంగ విచారణ నిర్వహించగా.. మహారాష్ట్రలో నిర్వహించలేదని గుర్తుచేశారు. దీంతో మహారాష్ట్రకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్, సీడబ్ల్యూసీ, ఆర్వీ అసోసియేట్స్ నివేదికలు వారం రోజుల్లోగా అందించిన తర్వాత.. దీనిపై సమగ్ర అధ్యయనం అనంతరం ఈ నెల మూడో వారంలో తదుపరి సమావేశం నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ అంశాలన్నింటినీ ఉన్నతస్థాయిలో నివేదించి, సమ్మతి తెలపాలని మహారాష్ట్ర అధికారులకు సీడబ్ల్యూసీ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి
కల్యాణలక్ష్మికి హైకోర్టు పచ్చజెండా
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఊరట