నాణ్యమైన రహదారులు.. ప్రజల భద్రతే మా లక్ష్యం
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:55 AM
రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన రోడ్లు, వారి భద్రతే తమ ప్రథమ లక్ష్యమని, ఆ దిశగానే రోడ్ల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
సీఎం నేతృత్వంలో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం
ఐఆర్‌సీ సదస్సును ఈసారి తెలంగాణలో నిర్వహిస్తున్నాం
నేడు కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం రేవంత్ ప్రారంభిస్తారు
ఈ సదస్సు కూడా పెట్టుబడులకు ఒక వేదిక కాబోతోంది
హ్యామ్ రోడ్లలో జాప్యం లేదు.. పనులు మొదలయ్యాయి
మంచి రోడ్డు అంటే గుంతలు లేకుండా ఉండడమే
కాదు.. ప్రయాణికులు క్షేమంగా గమ్యం చేరుకోవాలి
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఇలాంటి సమావేశాల వల్ల మన రాష్ట్రానికి చాలా ఉపయోగం ఉంటుంది. వివిధ దేశాల నుంచి వచ్చే పెద్ద నిర్మాణ సంస్థలు, సాంకేతిక రంగ సంస్థలతో మనకు పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. -కోమటిరెడ్డి
హైదరాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన రోడ్లు, వారి భద్రతే తమ ప్రథమ లక్ష్యమని, ఆ దిశగానే రోడ్ల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్ (హ్యామ్) విధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రహదారుల నిర్మాణం, నూతన టెక్నాలజీలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద సమావేశమైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) 85వ సదస్సును ఈసారి తెలంగాణలో నిర్వహించబోతున్నామని చెప్పారు. ఇది పెట్టుబడులకు ఒక వేదికగా ఉంటుందని తెలిపారు. రోడ్ల నిర్మాణంలో కొత్త ఇంజనీరింగ్ పద్ధతులు, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై దేశ విదేశాల నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటారని చెప్పారు. ఐఆర్‌సీ సదస్సు సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఐఆర్‌సీ సదస్సు నిర్వహణ ఎలా ఉండబోతోంది?
నిజంగా ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. రహదారుల రంగానికి సంబంధించి దేశంలో అతిపెద్ద సమావేశాల్లో ఒకటైన ఐఆర్‌సీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం మనకు దక్కిన మంచి అవకాశం. గురువారం నుంచి నాలుగు రోజుల (19-22) పాటు హైటెక్స్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సదస్సు ప్రారంభమవుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి 3,500 మందికి పైగా నిపుణులు, ఇంజనీర్లు, అధికారులు వస్తున్నారు. తెలంగాణ గొప్పతనాన్ని, మన సంస్కృతిని, మన ఆతిథ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నాను. సుమారు 400 స్టాళ్లతో సాంకేతిక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. రహదారుల నిర్మాణంలో వాడుతున్న కొత్త యంత్రాలు, ఆధునిక పద్ధతులు, కొత్త ఆవిష్కరణలను ఆయా సంస్థలు ప్రదర్శిస్తాయి. టెక్నికల్ ఎక్స్‌పోను బుధవారం సాయంత్రమే ప్రారంభించాను.
ఐఆర్‌సీలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేస్తామంటున్నారు. అందులో ఏం చెబుతారు?
తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో నిర్మిస్తున్న రహదారులు, వంతెనలు, ఆస్పత్రులు, ఇతర అభివృద్ధి పనులను చూపిస్తాం. రామప్ప దేవాలయం నిర్మాణ శైలికి సంబంధించిన వివరాలను తెలిపేలా ఏర్పాట్లు చేశాం. డిసెంబరులో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026, ఖేలో ఇండియా కార్యక్రమాల వివరాలను కూడా పెవిలియన్‌లో పెడతాం. నూతన హైకోర్టు డిజైన్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నిమ్స్ విస్తరణ పనుల వివరాలను ప్రదర్శిస్తాం. ప్రతిరోజూ సాయంత్రం తెలంగాణ జానపద కళలు, పాటలు, నృత్యాలతో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. బతుకమ్మ, బోనాల గొప్పతనాన్ని అతిథులకు పరిచయం చేస్తాం.
రోడ్ల నిర్మాణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఐఆర్‌సీలో కొత్త టెక్నాలజీపై చర్చలుంటాయా?
కాలంతో పాటు రహదారుల నిర్మాణంలోనూ మార్పులు రావాలి. గతంలో రోడ్డు వేస్తే సరిపోయేది. ఇప్పుడు ఎంత నాణ్యతతో నిర్మిస్తున్నాం, ఎంతకాలం మన్నికగా ఉంటుంది, వర్షాలు, వరదలు వచ్చినా రోడ్డు పాడవకుండా ఎలా కాపాడాలి, ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలు చాలా ముఖ్యం. అందుకే ఈ సమావేశాల్లో కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, పర్యావరణానికి హాని చేయని రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చిస్తారు. మొత్తం 19 ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. సొరంగ మార్గాల నిర్మాణం, కొత్త ఇంజనీరింగ్ పద్ధతులు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై దేశ విదేశాల నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటారు. హైదరాబాద్-విజయవాడ హైవే, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, గ్రామీణ రహదారుల నిర్మాణం వంటి పనుల్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
ఈ సమావేశాలతో పెట్టుబడులువస్తాయా?
కచ్చితంగా.. ఇలాంటి సమావేశాల వల్ల మన రాష్ట్రానికి చాలా ఉపయోగం ఉంటుంది. వివిధ దేశాల నుంచి వచ్చే నిపుణులు, పెద్ద నిర్మాణ సంస్థలు, సాంకేతిక రంగ సంస్థలతో మనకు పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పద్ధతులు తెలుసుకోవచ్చు. మన దగ్గరున్న ప్రాజెక్టులను వారికి చూపించే అవకాశం వస్తుంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే సంస్థలకు కూడా మంచి అవకాశం కల్పిస్తాం. తద్వారా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
హ్యామ్ రోడ్ల పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని విమర్శలున్నాయి. మీరేమంటారు?
పనుల్లో జాప్యం ఏమీలేదు. కొన్నిచోట్ల పనులు మొదలయ్యాయి. తెలంగాణలో రోడ్ల పరిస్థితిని పూర్తిగా మార్చాలన్నది మా ప్రభుత్వ ఆలోచన. అందుకే హ్యామ్ విధానంలో భారీగా రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తొలి దశలో రూ.13,006.27 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేర 441 రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఈ పనులకు నల్గొండ జిల్లా కనగల్‌లో శంకుస్థాపన చేశాం. ఈ విధానంలో రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా 15 ఏళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థలదే. దీనివల్ల రోడ్లు ఎక్కువకాలం బాగుంటాయి. ఒక్కసారి ఆలోచించండి.. రైతు తన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లాలంటే మంచి రోడ్డు ఉండాలి. ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్లాలన్నా, ఒక రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నా రోడ్డు బాగుండాలి. గ్రామానికి మంచి రోడ్డు ఉంటే ఉపాధి అవకాశాలు వస్తాయి. నా ఉద్దేశంలో మంచి రోడ్డు అంటే గుంతలు లేకుండా ఉండటమే కాదు.. ఆ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవాలి. ప్రమాదాలు తగ్గాలి.. ప్రాణాలు పోకూడదన్నదే నా లక్ష్యం. ఎందుకంటే ప్రాణం విలువ నాకు బాగా తెలుసు.
పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రం ఏమంటోంది? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడారా?
రాష్ట్రానికి మంజూరైన జాతీయ రహదారుల గురించి కేంద్రంతో సంప్రదిస్తున్నాం. గడ్కరీతోనూ చర్చలు జరుపుతున్నాం. హైదరాబాద్-విజయవాడ హైవేను 6+2 లేన్లుగా విస్తరించడం, ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు 6 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, రూ.1,230 కోట్లతో మంజూరైన ఐదు రోప్‌వే ప్రాజెక్టులు, మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు, హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవే వంటి పనులను ముందుకుతీసుకెళ్లాలని కోరుతున్నాం. రూ.1,227.75 కోట్లతో 511.68 కిలోమీటర్ల సీఆర్‌ఐఎఫ్ రోడ్లు, 2,144 కిలోమీటర్ల మేర ఉన్న 23 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం వంటి అంశాలనూ కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాం. నల్గొండలో 67 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి రహదారుల శిక్షణసంస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News