మునుగోడుకు నిధులివ్వకుంటే కురుక్షేత్రమే
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:55 AM
‘అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రివి అయ్యావు.. ఇంకా రెండేళ్లు మంచిగా ఉండు.. ప్రజలను మంచిగా చూసుకో’ అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కొడంగల్, మధిర, హుజూర్‌నగర్‌కే కాదు.. అన్ని నియోజకవర్గాలకూ నిధులు ఇవ్వాలి
అదృష్టం కొద్దీ రేవంత్ సీఎం అయ్యారు
పండబెట్టి తొక్కుతాననడం.. ఏం భాష?
పాలనపై ప్రజలు సంతోషంగా లేరు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రివి అయ్యావు.. ఇంకా రెండేళ్లు మంచిగా ఉండు.. ప్రజలను మంచిగా చూసుకో’ అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు అడిగితే.. పండబెట్టి తొక్కుతానని మాట్లాడడం భావ్యం కాదని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు హుందాగా మాట్లాడాలని సూచించారు. నల్లగొండ జిల్లా మునుగోడులో బుధవారం చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ సభలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. కొడంగల్‌కు రూ.20వేల కోట్లు తీసుకెళ్లినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ.. తండ్రి పాత్ర పోషించాల్సిన ముఖ్యమంత్రి అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హూజూర్‌నగర్ మాత్రమే కాదని, మిగతా నియోజకవర్గాలకు నిధులివ్వకుండా వివక్ష చూపడం సరికాదని ఆగహ్రం వ్యక్తం చేశారు. మునుగోడు అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించకుంటే మరో కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు. మునుగోడులో సాగు, తాగు నీటి వనరుల అభివృద్ధికి నిధులు అందడం లేదని, డిండి ఎత్తిపోతల పథకం పనులు పెండింగ్‌లో ఉండటంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చౌటుప్పల్‌లో వంద పడకల ఆస్పత్రి పనులూ ముందుకు సాగడం లేదన్నారు.
నియోజకవర్గ సమస్యలపై నాలుగు గోడల మధ్య వినతిపత్రాలు ఇస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని, నిధులివ్వాలని బయట వేదికలపై మాట్లాడితే మాత్రం క్రమశిక్షణ పేరుతో కట్టడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై ప్రజలు సంతోషంగా లేరని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నామో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పేదవర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, విద్యతోపాటు వైద్యం అందుబాటులో లేకుండా పోయాయని విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రా పాలకుల కనుసన్నల్లోనే తెలంగాణ పాలన సాగుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News