శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర:ప్రొ కోదండ రాం
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:34 PM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండ రాం తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండ రాం తెలిపారు. ఎంతో మంది ప్రాణ త్యాగం చేస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. తెలంగాణ ఆకాంక్షలను బీజేపీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ అర్థం చేసుకున్నారని చెప్పారు. తేజస్వీ సూర్యని బీజేపీ నేతలు వెనకేసుకు రావడం బాధాకరమని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగానే తెలంగాణ ఏర్పాటైందని చెప్పారు. పదే పదే తెలంగాణను కించ పరచడం పద్ధతి కాదంటూ బీజేపీ నేతలకు ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు.
శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ప్రొ. కోదండ రాం విలేకర్లతో మాట్లాడుతూ.. ఏ మాత్రం సందర్భం లేకుండా తెలంగాణ ఏర్పాటుపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ తేజస్వీ సూర్యపై మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాల కూర్పు జరుగుతుందని వివరించారు. ఏ మాత్రం అవగాహన లేకుండా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులకు తెలంగాణ ఏర్పాటుకు ముడి పెడుతూ తేజస్వీ సూర్య విమర్శలు చేశారని విమర్శించారు. బీజేపీ ఎంపీ మాట్లాడుతుంటే.. కేంద్ర మంత్రులు కూడా ఆయన్ని నిలువరించక పోవడం బాధాకరమన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన బిల్లుకు బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ విషయం అర్ధం చేసుకోకుండా.. తేజస్వీ సూర్య మాట్లాడటం బాధాకరమన్నారు. తెలంగాణను విమర్శించే విధంగా తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఖండించక పోవడం శోచనీయమని పేర్కొన్నారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలు పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని బీజేపీలోని సీనియర్లకు స్పష్టం చేశారు.
డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రాలకు సంబంధించిన సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారని ప్రొ. కోదండ రాం తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారమా?.. 2026 జనాభా లెక్కల ప్రకారమా? ఈ డీలిమిటేషన్ చేస్తుంది అనేది ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాది, దక్షిణాది మధ్య అసమతుల్యత, తారతమ్యాలు ఈ డీలిమిటేషన్ చూపిస్తుందన్నారు. అన్ని రాష్ట్రాలకు అర్థవంతమైన భాగస్వామ్యం ఉండాలని.. లేకంటే గొడ్డలి పోట్టు లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశ ప్రయోజనాలను మర్చిపోయి డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడం బాధాకరమన్నారు. డీలిమిటేషన్, సీట్ల ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీట్ల పెంచుకుని శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెంచుకుని.. ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోందని ఆ పార్టీ నేతల తీరును ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్స్ బిల్లును కేంద్రం తొక్కి పెట్టిందని గుర్తు చేశారు.
మే12వ తేదీన తెలంగాణ జన సమితి ప్లీనరీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్లీనరీ వేదికగా తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి 4వ ప్లీనరీ పోస్టర్స్‌ను ప్రొ. కోదండ రాం ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింహాచలం అప్పన్న చందనోత్సవం.. భక్తులకు కీలక సూచన
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక
For More TG News And Telugu News