Share News

రాహుల్‌కు అబద్ధాలు అలవాటే

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:27 AM

రాజ్యాంగ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేసి, ప్రజల్లో అప నమ్మకం కలిగించడం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్‌కు అబద్ధాలు అలవాటే
Kishan Reddy

  • ఈసీపై ఆయన ఆరోపణలు బాధ్యతారహితం

  • ఫామ్‌-6పై కాంగ్రెస్‌ మార్కు అబద్దాల ప్రచారం

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేసి, ప్రజల్లో అప నమ్మకం కలిగించడం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం చట్టపర వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా.. ఏ ఆధారాల్లేకుండా కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు ఆయన బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతున్నాయని, రాజ్యాంగ సంస్థలపై ఆయన అబద్ధాల ప్రచారం మరోమారు బట్టబయలైందని మంగళవారం ఓ ప్రకటనలో మండి పడ్డారు. రాజకీయ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ఒక వివాదాన్ని సృష్టించి.. రాజ్యాంగ సంస్థలను అనుమానాల నీడలోకి నెట్టడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. ‘సర్‌’పై నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఫామ్‌-6పైనా మరో అసత్య ప్రచారానికి తెర తీసిందని.. ఇదంతా కాంగ్రెస్‌ మార్కు అబద్దాల ప్రచారంలో భాగమేనని ఎద్దేవా చేశారు.


‘లోక్‌సభలో విపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి కంటే.. రాజకీయ ఓటములను జీర్ణించుకోలేని నాయకుడి నిస్సహాయ, నిరాశా నిస్పృహలతో కూడిన ప్రవర్తనే రాహుల్‌లో ఎక్కువగా కనిపిస్తోంది’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ముందు అసత్యాలను ప్రచారంలోకి తెచ్చి .. ప్రజల్లో అనుమానాలు సృష్టించడం, తర్వాత కోర్టులకెళ్లి క్షమాపణ చెప్పడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందన్నారు. ‘ఇకనైనా కల్పిత కుట్రల వెనుక దాక్కోవడం మానుకోవాలి. రాహుల్‌ గాంధీ తన రాజకీయ వైఫల్యాలను నిజాయితీగా అంగీకరించాలి. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు పూర్తి బాధ్యత వహించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ప్రజా విశ్వాసాన్ని పొందలేకపోతే ఆ తప్పును ప్రజాస్వామ్య వ్యవస్థపై నెట్టడం సరికాదన్నారు. రాజకీయ వైఫల్యాలకు రాజ్యాంగ సంస్థలను బలి పశువులను చేయడం బాధ్యతాయుతమైన విపక్ష నేత లక్షణం కాదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ రాహుల్‌ పలు తప్పిదాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు.


ఓటములు జీర్ణించుకోలేకే..: కె.లక్ష్మణ్‌

వరుస ఓటములను జీర్ణించుకోలేకే పసలేని ఆరోపణలతో ఈసీఐపై రాహుల్‌ గాంధీ ఎదురు దాడి చేస్తున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని అవమానించడం ప్రజాస్వామ్య పరిరక్షణ కాదని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈసీఐని ఒక పోస్టాఫీసులా చూస్తున్న కాంగ్రెస్‌.. ఓటమి పాలైన ప్రతిసారీ చేసిన ఫిర్యాదుపై తమకు నచ్చిన సమాధానం వస్తుందని ఆశిస్తోందని, నచ్చిన జవాబు రాకుంటే పోస్ట్‌మ్యాన్‌ను దూషిస్తోందని ఎద్దేవా చేశారు.


ఇవి కూడా చదవండి...

సైబర్‌ నేరగాళ్లు లక్షలు కొట్టేశారు!

ఆ 45 ఎకరాలు ఎక్కడ!?

లైపోప్రొటీన్‌(ఎ).. సైలెంట్‌ కిల్లర్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 04:27 AM