సైబర్ నేరగాళ్లు లక్షలు కొట్టేశారు!
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:21 AM
సైబర్ నేర ముఠాల ఆగడాలు ఆగడం లేదు. ఏదో ఒక రకంగా అమాయకులకు ఎరవేసి రూ.లక్షలు కొట్టేస్తున్నారు. అమెజాన్ డెలివరీ పాయింట్ అంటూ ఓ వ్యక్తికి రూ.48 లక్షలకు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు..
అమెజాన్ డెలివరీ పాయింట్ పేరిట 48లక్షలకు టోకరా..
మహిళల పేరుతో సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వె్‌స్టలు
స్టాక్, క్రిప్టో ట్రేడింగ్, టాస్కుల పేరిట ఎర
ఒకరికి రూ.18.69 లక్షలు, మరొకరికి రూ.10 లక్షలకు బురిడీ
ట్రాఫిక్ చలాన్ అంటూ 3.16 లక్షల దోపిడీ
హైదరాబాద్ సిటీ; అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేర ముఠాల ఆగడాలు ఆగడం లేదు. ఏదో ఒక రకంగా అమాయకులకు ఎరవేసి రూ.లక్షలు కొట్టేస్తున్నారు. అమెజాన్ డెలివరీ పాయింట్ అంటూ ఓ వ్యక్తికి రూ.48 లక్షలకు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. ట్రాఫిక్ చలాన్ పేరిట సకిలీ పరివాహన్ యాప్‌తో మరొకరి బ్యాంకు ఖాతాలోని రూ.3.16 లక్షలు మాయం చేశారు. ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వె్‌స్టతో పరిచయమైన ఓ అమ్మాయి వేసిన ట్రేడింగ్ వలలో పడిన ఓ వ్యక్తిరూ.18.69 లక్షలు పోగొట్టుకున్నారు. గూగుల్ రేటింగ్ టాస్కులు, క్రిప్టో ట్రేడింగ్ అంటూ చేసిన మాయకు మరో వ్యక్తిరూ.10 లక్షల దోపిడీకి గురయ్యాడు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ సమీపంలోని పటాన్‌చెరుకు చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 20న అమెజాన్ డెలివరీ సర్వీస్ పాయింట్ ఏర్పాటుకు సంబంధించిన ఓ ప్రకటనను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి దరఖాస్తు చేసుకున్నారు. ఆపై, అమెజాన్ ప్రతినిధులమంటూ కొందరు వ్యక్తులు ఆయనను ఉచ్చులోకి లాగారు. అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్, సెక్యూరిటీ డిపాజిట్లు, ఇన్‌స్టలేషన్ చార్జీలు, శిక్షణ రుసుము అంటూ రకరకాల పేర్లతో విడతల వారీగా రూ.48లక్షలు వసూలు చేశారు. అయినా.. డెలివరీ సర్వీస్ పాయింట్ ప్రారంభానికి ధ్రువీకరణ పత్రాలు అందలేదు. ఆరా తీస్తే రూ.7,89,990లు గేట్‌వే బిల్ బకాయి ఉందని తెలిపారు. దీంతో కాంట్రాక్టు రద్దును కోరగా రద్దు రుసుము చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ట్రాఫిక్ చలాన్ అంటూ 3.16లక్షలు మాయం
గచ్చిబౌలికి చెందిన ఓ వ్యక్తి మొబైల్‌కు అక్టోబరు 3న ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చలాన్ సందేశం వచ్చింది. బాధిత వ్యక్తి ఆ లింక్‌ను క్లిక్ చేయగానే.. ‘నెక్ట్స్‌జెన్ ఎంపరివార్ యాప్’ పేరుతో ఓ అప్లికేషన్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయింది. అది ప్రభుత్వ ఎం-పరివాహన్ యాప్ లోగో ఉండటంతో అసలైన యాప్ అని భావించారు. చలానా వివరాలు తెలుసుకునేందుకు యూపీఐ పిన్ ఉపయోగించి రూ.1 చెల్లించారు. అనంతరం యాప్ నకిలీదని అనుమానం వచ్చి వెంటనే మొబైల్ నుంచి తొలగించారు. కానీ, కాసేపటికి వివిధ అప్లికేషన్లకు సంబంధించిన ఓటీపీ సందేశాలు వరుసగా వచ్చాయి. ఎస్‌బీఐ యూపీఐ రిజిస్ట్రేషన్ సందేశం వచ్చింది. దీంతో బాధితుడు ఎస్‌బీఐకి, తాను చేసిన యూపీఐ లావాదేవీకి సంబంధించి హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. కానీ, మరుసటి రోజు బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి 8 అనధికార లావాదేవీల్లో సుమారు రూ.3,16,515.48లు బదిలీ అయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
ఫేస్‌బుక్ రిక్వె్‌స్టతో రూ.18.69 లక్షలు ఫట్
హైదరాబాద్, మణికొండకు చెందిన ఓ వ్యక్తికి అపూర్వరెడ్డి అనే పేరుతో ఉన్న ప్రొఫైల్ నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని అంగీకరించగా తాను కౌలాలంపూర్‌లో ఉంటానని, తనలాగే స్టాక్, క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించింది. బాధితుడు విడతల వారీగా రూ.రూ.18,69,145ను పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత అపూర్వ రెడ్డి ఫోన్ బ్లాక్ చేసింది.
గూగుల్ రేటింగ్ టాస్కులతో 10లక్షలకు టోకరా
హైదరాబాద్ చందానగర్‌కు చెందిన ఓ వ్యక్తికి సెప్టెంబరు 30న నీతాశర్మ వాట్సా్‌పలో పరిచయమైంది. తమ సంస్థ బ్రాండ్లకు గూగుల్ రేటింగ్స్ ఇస్తే డబ్బు చెల్లిస్తామని చెప్పింది. దీంతో బాధితుడు ఓ నకిలీ ట్రేడింగ్ యాప్‌లో విడతల వారీగా రూ 5,43,571లు జమ చేశాడు. విత్‌డ్రాకు యత్నించగా.. ఖాతా పునరుద్ధరణకు రూ.3.80లక్షలు చెల్లించాలనడంతో ఆ మొత్తాన్నీ జమచేశాడు. ఖాతా అప్‌గ్రేడ్ అంటూ మరో రూ.4లక్షలు తీసుకున్నారు. అయినా విత్‌డ్రా అవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి...
రాహుల్ పోరాటంతో కేంద్రంలో వణుకు
లైపోప్రొటీన్(ఎ).. సైలెంట్ కిల్లర్
Read Latest AP News And Telugu News