డ్రగ్స్ రహిత దేశాన్ని నిర్మిద్దాం.. రండి
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:42 AM
మద్యం, మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలను తరిమికొట్టేందుకు రాజకీయాలకు అతీతంగా సమాజమంతా కదిలిరావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దాం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు
డ్రగ్స్‌రూపంలో దేశ యువతపై కుట్ర
ఏకమై పోరాడాలి: రాంచందర్‌రావు
నిర్మూలన బాధ్యత పూర్తిగా సమాజంపైనే: జయప్రకాశ్‌నారాయణ
25 నుంచి కిషన్‌రెడ్డి పాదయాత్ర
హైదరాబాద్ సిటీ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మద్యం, మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలను తరిమికొట్టేందుకు రాజకీయాలకు అతీతంగా సమాజమంతా కదిలిరావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో కిషన్‌రెడ్డి సారధ్యంలో ‘నషా ముక్త్ భారత్’ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదని.. దేశ భవిష్యత్తుతో ముడిపడిన అంశమని స్పష్టం చేశారు. మద్యం, డ్రగ్స్ మత్తులో యువత తల్లిదండ్రులను హింసించడమే కాకుండా, నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు.. డిసెంబరు 31, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
కాగా, మంత్రి కిషన్‌రెడ్డి కవాడీగూడలో సోషల్ మీడియా ప్రభావ శీలురుతోనూ విడిగా సమావేశమై.. డ్రగ్స్ మహమ్మారిని తిరిమికొట్టడంలో నేటితరం డిజిటల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని మెచ్చుకున్నారు. యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా మార్చడం ద్వారా దేశాన్ని బలహీనపరిచే ఉద్దేశపూర్వక కుట్రలు జరుగుతున్నాయని నషా ముక్త్ భారత్ సదస్సులో పాల్గొన్న సందర్భగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఈ ప్రమాదం నుంచి దేశ యువతను రక్షించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి రావాలని కోరారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలన బాధ్యత పూర్తిగా సమాజంపైనే ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డి-అడిక్షన్ కేంద్రాలను విస్తృతంగా నెలకొల్పి, పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
చెడు అలవాట్లలో నేడు స్త్రీ, పురుష సమానత్వం సాధించామని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇదే సదస్సులో భాగంగా వ్యాఖ్యానించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ మంది పట్టుబడుతున్నారని చెప్పారు. నేడు పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు అతిపెద్ద సవాల్‌గా మారిందని.. మద్యం, మత్తు పదార్థాల నుంచి వారిని కాపాడుకోవడమే అత్యంత కష్టమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ ఉద్యమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల 25న అంబర్‌పేట నుంచి 27వ తేదీన ఫిలింనగర్ వరకు పాదయాత్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కాగా, ఈ యాత్రకు సినీ నటుడు వెంకటేష్, దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. యాత్రకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన టీషర్టులను మంత్రి కిషన్‌రెడ్డితో కలసి నటుడు వెంకటేష్ ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు!
22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్ టికెట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News