ఇంధన ధరలు పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
ABN , Publish Date - May 15 , 2026 | 12:32 PM
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాజకీయ పార్టీలు చేసే విమర్శలు పట్టించుకోవద్దని ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల ఈ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.
హైదరాబాద్, మే 15: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా వాడుకొంటున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు పని పాట లేదని.. అందువల్లే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఆ యా పార్టీల నేతల మాటలు విని మోసపోవద్దంటూ ప్రజలకు స్పష్టం చేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు పెరిగాయన్నారు. ఈ పెంచిన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయని చెప్పారు. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావంతోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు అనివార్యమైందన్నారు.
అంతేకానీ ఇది ప్రజల మీద భారం వేసేందుకు కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. క్రూడాయిల్ దిగుమతికి భారీగా ఖర్చు అవుతుందని వివరించారు. అందుకోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, జర్మనీ, జపాన్ తదితర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
పెట్రోల్, డీజిల్ లీటర్ ధరలు రూ.3కు పైగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన ధరలు ఈ రోజు (శుక్రవారం) ఉదయం 6.00 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. వీటి ధరలు పెంచడం వల్ల ప్రజలపై అదనపు భారం పడుతుందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైవిధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అజ్ఞాతంలో బండి భగీరథ్.. స్పందించిన బాధితురాలి తల్లి
ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి లోకేశ్
For More TG News And Telugu News