అజ్ఞాతంలో బండి భగీరథ్.. స్పందించిన బాధితురాలి తల్లి
ABN , Publish Date - May 15 , 2026 | 09:36 AM
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. దీంతో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
హైదరాబాద్, మే 15: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. దీంతో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బండి భగీరథ్ విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనకు రెండు రోజుల సమయం ఇవ్వాలంటూ వారిని బండి భగీరథ్ కోరారు. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లి శుక్రవారం లేఖ విడుదల చేశారు. చట్టానికి అనుగుణంగా మైనర్ బాలిక గుర్తింపును గోప్యంగా ఉంచుతున్నామని స్పష్టం చేశారు. తన కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తు కావాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నామని వివరించారు. తమది సాధారణ మధ్య తరగతి కుటుంబమని తెలిపారు. రాజకీయ లేదా ఆర్థిక ప్రభావం కోసం.. ప్రతీకారం లేదా ప్రచారం కోసం కాదని.. న్యాయం కోసమే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు ఆమె వివరించారు.
మౌనం కంటే నిజం చెప్పడం అవసరమని తాను భావించానని ఈ సందర్భంగా బాధితురాలి తల్లి పేర్కొన్నారు. 2025లో బండి భగీరథ్‌తో పరిచయం ఏర్పడిందని తన కుమార్తె తనకు తెలిపిందన్నారు. తమ కుమార్తెకు చదువుపై దృష్టి తగ్గేలా చేసి, శారీరక సంబంధానికి ఒత్తిడి తెచ్చారంటూ బండి భగీరథ్‌పై బాధితురాలు తల్లి మండిపడ్డారు. 2025, డిసెంబర్ 31 రాత్రి నుంచి 2026, జనవరి1వ తేదీ తెల్లవారుజాము వరకు మొయినాబాద్‌లో జరిగిన ఘటనలను ఈ సందర్భంగా బాలిక తల్లి వివరించారు.
మద్యం సేవించమని ఒత్తిడి చేసి, బలహీన పరిస్థితిలో అనుచిత ప్రవర్తనకు తమ కుమార్తెను బండి భగీరథ్ గురి చేశాడన్నారు. ఈ ఘటనతో తన కుమార్తె తీవ్ర భయం, అవమానం, మానసిక వేదన అనుభవించిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తన కుటుంబం వద్ద వాట్సాప్ చాట్స్, మెసేజ్‌లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆధారాలు కూడా ఉన్నాయని బాధితురాలి తల్లి వెల్లడించారు.
అలాగే భగీరథ్ చాటింగ్‌లో క్షమాపణలు చెప్పడం, ఎమోషనల్‌గా ఒత్తిడి చేయడం చేశారని బాధితురాలి తల్లి వాపోయారు. డిజిటల్ ఆధారాలను భద్రపరచి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. జనవరిలో బ్రేకప్ తర్వాత బాలిక మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందన్నారు. ఆనందంగా ఉండే తమ కుమార్తె పూర్తిగా మౌనంతో కుంగిపోయిందని తెలిపారు. ఆ సమయంలో నిందితుడి నుంచి తమకు పలుమార్లు కాల్స్ వచ్చాయని గుర్తు చేశారు. భగీరథ్ మెసేజ్‌ల వల్ల తమ కూతురు మానసికంగా కుంగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
2026 మార్చి, ఏప్రిల్‌లలో చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు తాము ముందుకు వెళ్లామని వివరించారు. ఆ సమయంలో పరోక్ష ఒత్తిళ్లు, రాజీ ప్రయత్నాలు, కేసు పెట్టవద్దంటూ తమకు అభ్యర్థనలు వచ్చాయన్నారు. ఏప్రిల్ 21వ తేదీ తమ కుటుంబంపై బ్లాక్‌మెయిల్, ఎక్స్‌టోర్షన్ ఆరోపణలతో ఫిర్యాదు నమోదు కావడం భయాందోళనకు గురయ్యామన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన సమయంలో తమ కుటుంబాన్నే నిందితుల్లా చూపించే ప్రయత్నం జరిగిందని వివరించారు.
ఏప్రిల్ 22వ తేదీ సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి మాట్లాడాడని బాధితురాలి తల్లి చెప్పారు. ఏప్రిల్ 23వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను తాము కలిశామన్నారు. భరోసా కోసం వెళ్లినా తమను భయపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి తమ కుటుంబం నిరంతర భయం, భావోద్వేగ ఒత్తిడిలతో జీవిస్తోందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.
2026, మే 8న పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేశామని బాధితురాలి తల్లి తెలిపారు. మైనర్ బాలిక కేసు అయినప్పటికీ ఐదు గంటలకుపైగా తాము పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండాల్సి వచ్చిందన్నారు. జీరో ఎఫ్ఐఆర్‌పై పలుమార్లు ఒత్తిడి చేసిన తర్వాత తమ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారని వివరించారు. ఆ సమయంలో తమ కుమార్తె మానసికంగా కుంగిపోయిందని ఆవేదన చెందారు. మైనర్ బాలిక ఇచ్చిన వాంగ్మూలం అనంతరం నాన్ - బెయిలబుల్ సెక్షన్లు పోలీసులు చేర్చారన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుతో ఈ కేసు దర్యాప్తు వేగవంతమైందని తెలిపారు.
ఈ కేసులో నిందితుడు బండి భగీరథ్ ఇంకా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడని ఆమె విమర్శించారు. వయస్సుకు సంబంధించిన పత్రాలపై దృష్టి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితురాలి తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదానికి ముందే డేట్ ఆఫ్ బర్త్ రికార్డుల సవరణ ప్రక్రియ జరిగిందన్నారు. ఈ పత్రాల్లో సాంకేతిక లోపాలు ఉన్నా, బాలిక అనుభవించిన బాధను అవి తగ్గించ లేవన్నారు. పోక్సో చట్టం ద్వారా బాలికకు లభించే రక్షణను ఎవరూ దూరం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ కుటుంబం నిరంతర భయం, మానసిక ఒత్తిడికి గురవుతుందంటూ బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
బెదిరింపులు, ఒత్తిళ్లు, సోషిల్ మీడియాలో టార్గెటింగ్ నుంచి తమకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి బాధితురాలి తల్లి విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థలు, మహిళా కమిషన్లు, బాలల హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రతి ఆధారాన్ని చట్ట ప్రకారం భద్రపరిచి స్వతంత్రంగా దర్యాప్తు జరపాలని పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేశారు. బాధితురాలి గుర్తింపును బయట పెట్టవద్దని మీడియా, సోషల్ మీడియాను ఆమె కోరారు.
వ్యక్తిగత సమాచారాన్ని ప్రచారం చేయడం బాలిక మానసిక వేదనను మరింత పెంచుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, చట్టపరమైన వ్యవస్థపై ఇంకా తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. చట్టపరమైన ప్రక్రియలకు తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. చివరకు నిజం, న్యాయం గెలుస్తాయని బాధితురాలి తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి లోకేశ్
ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం
For More TG News And Telugu News