ప్రజల నాడి పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైన రాహుల్ గాంధీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:54 PM
దేశ ప్రజల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలోని నేతలతోపాటు ఆయన దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఒకే ఎజెండాతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ, నవంబర్ 20: దేశ ప్రజల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలోని నేతలతోపాటు ఆయన దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఒకే ఎజెండాతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవగాహన లేకుండా దేశంపై విషం చిమ్ముతున్నారంటూ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని రాజ్యాంగ సంస్థలను ప్రపంచ వేదికలపై అవమానిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీని అవమానించడం కాదని.. దేశ ప్రజలను అవమానించడమేనని స్పష్టం చేశారు.
ఆందోళన చెందుతున్న దేశ ప్రజలు..
ప్రధాని మోదీని విమర్శిస్తున్నామని.. మతి మరిచి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోపాటు ఎంపీ రాహుల్ గాంధీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దేశ ప్రధాని, రాజ్యంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. విమర్శించడమే ఎజెండాగా మాట్లాడడం పట్ల దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న రాహుల్ గాంధీ..
దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు చేయడం లేదని రాహుల్ గాంధీ తీరును ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఎండగట్టారు. తుకుడే గ్యాంగ్‌లతో కలిసి రాహుల్ గాంధీ దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశం అభివృద్ధి, స్థిరత్వంతో ముందుకు వెళ్తుందని ప్రపంచ దేశాలు చెబుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణలో అధికారంలోకి బీజేపీ..
తెలంగాణలో బీజేపీ 8 లోక్‌సభ సీట్లు ఎలా గెలిచిందో.. మీ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని అడగండంటూ రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సూచించారు. వచ్చే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వారి గుట్టు విప్పుకుంటున్నాయని అన్నారు. ఈ పార్టీలకు ఎందుకు ఓటు వేశామని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆట మొదలుపెట్టనున్న బీజేపీ..
తెలంగాణ ప్రజల సంక్షేమానికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దోపిడి చేశాయని అన్నారు. బీజేపీ ఆట తెలంగాణలో మొదలు పెడుతుందని.. ఈ రెండు పార్టీల సంగతి చూస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీల బట్టలు విప్పేస్తారని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. లోకజ్ఞానం లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాహుల్‌కు కిషన్ రెడ్డి కీలక సూచన
విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి భారతీయులను కలవాలంటూ రాహుల్ గాంధీకి సూచించారు. వాళ్ల విలువ పెరిగిందని చెబుతారని అన్నారు. తెలంగాణ నుంచి వస్తున్న నగదు ఇతరులకు ఇచ్చి ఈవెంట్స్ చేస్తున్నారని అన్నారు. భారతదేశ గౌరవాన్ని తగ్గించే విధంగా ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంపై రాహుల్ గాంధీ దుమ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. 60 ఏళ్ల పాటు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టుపట్టించిందని.. అన్నింటిలో అవినీతి చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోపాటు గాంధీ కుటుంబం గురించి దేశ ప్రజలకు మొత్తం తెలుసునని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రొమ్ము క్యాన్సర్ గుర్తింపునకు ఏపీకి 750 ఐబ్రెస్ట్ పరికరాలు: మంత్రి సత్యకుమార్
తమిళనాడు దర్గా సమీపంలో కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి
Read Latest Telangana News And Telugu News