పల్లె పల్లెకూ ‘ఖేలో’ జోష్!
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:57 AM
ఖేలో ఇండియా సంరంభం పల్లె పల్లెకూ తాకేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
జాతీయ క్రీడా వేడుకలో ప్రతి జిల్లాకూ భాగస్వామ్యం..
రాజధానికే పరిమితం చేసే సంప్రదాయానికి తెర
1 నుంచి 8 వరకు ‘ఖేలో ఇండియా’ టార్చ్ ర్యాలీ
అన్ని జిల్లాలు చుట్టొచ్చేందుకు 2 ప్రచార రథాలు
11 నుంచి 22 దాకా హైదరాబాద్ సహా 20 వేదికల్లో 27 క్రీడాంశాల్లో పోటీల నిర్వహణ
వివిధ రాష్ట్రాల నుంచి 7వేల మంది ఆటగాళ్లు
ఈసారి ప్రదర్శన క్రీడగా రెండు రూపాల్లో కర్రసాము
ఖేలో ఇండియాలో తొలిసారిగా సాఫ్ట్‌బాల్‌కు చోటు
సత్తా చాటేందుకు తెలంగాణ క్రీడాకారులు సిద్ధం
హైదరాబాద్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఖేలో ఇండియా సంరంభం పల్లె పల్లెకూ తాకేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. తెలంగాణ వేదికగా వచ్చే నెల 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేడుకలను రాష్ట్రంలోని అన్ని వర్గాలు, మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరువ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆటల సందడిలో 33 జిల్లాల భాగస్వామ్యానికి ప్రతీకగా 1 నుంచి 8వ తేదీ వరకు ‘క్రీడా జ్యోతి’ యాత్ర (టార్చ్ ర్యాలీ) నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం నుంచి రెండు ప్రత్యేక ప్రచార వాహనాలతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఉత్తర, దక్షిణతెలంగాణ మార్గా ల్లో వేర్వేరుగా కొనసాగే ఈ యాత్ర షెడ్యూల్‌ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) ఖరారు చేసింది.
ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రధాన కూడళ్లలో ఖేలో ఇండియా మస్కట్ ‘నీలమణి’ నమూనాలు, భారీ స్పోర్ట్స్ జెర్సీలతో ఏర్పాట్లు చేసిన సెల్ఫీ పాయిం ట్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. 11 నుంచి 22 వరకు హైదరాబాద్ సహా 20 వేదికల్లో 27 క్రీడాంశాల్లో జరగనున్న ఖేలో ఇండియా పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి 7వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటారు. అత్యధికంగా స్విమ్మింగ్‌లో 38 ఈవెంట్లు, రెజ్లింగ్‌లో 21, బాక్సింగ్‌లో 20 ఈవెంట్లు ఉన్నాయి. ఈసారి పోటీల్లో ప్రదర్శన క్రీడగా కర్రసామును రెండు రూపాల్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల కోసం రాష్ట్ర సర్కారు రూ.203 కోట్లు, కేంద్రం రూ.21 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో రూ.120 కోట్లను స్టేడియాల ఆధునికీకరణకు, క్రీడా సామగ్రి కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. ఖేలో ఇండియా ఏర్పాట్లను సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోటీలను పకడ్బందీగా నిర్వహించేందుకు ‘శాయ్’ 40 మంది సాంకేతిక నిపుణులను ఎంపిక చేసింది.
ఓరుగల్లు నుంచి పాలమూరు దాకా జాతీయ క్రీడా జాతర
సాధారణంగా జాతీయస్థాయి క్రీడా పోటీలంటే రాజధాని నగరాలకే పరిమితమవుతుంటాయి. ఈ సారి ఆ సంప్రదాయానికి తెరదించుతూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సందడి తెలంగాణ పల్లెలు, జిల్లా కేంద్రాలకు విస్తరించింది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే యువ క్రీడాకారుల ప్రతిభను కళ్లారా చూసే అరుదైన అవకాశం ఇప్పుడు జిల్లావాసులకు దక్కబోతోంది. ఈ మెగా క్రీడా సంగ్రామం కోసం హైదరాబాద్‌తో పాటు హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లా కేంద్రాలు ముస్తాబవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను సమీక్షిస్తుండడంతో ఆయా జిల్లాల్లోని స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి.
జిల్లాల్లో క్రీడా సందడి తొలుత నిజామాబాద్‌లో మొదలుకానుంది. అక్కడి నవ్యభారతి పాఠశాలలో డిసెంబరు 13- 17 వరకు టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తారు. అథ్లెటిక్స్ పోటీలకు ఓరుగల్లు వేదికవుతోంది. హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో డిసెంబరు 18-21 వరకు రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ విభాగాల్లో మొత్తం 32 ఈవెంట్లు జరగనున్నాయి. డిసెంబరు 17-20 వరకు మరో 3 జిల్లాల్లో కీలక పోటీలు జరగనున్నాయి. ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియం విలు విద్య (ఆర్చరీ) పోటీలకు సిద్ధమవుతోంది. కరీంనగర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియం జూడో పోటీలకు ముస్తాబవుతోంది. కబడ్డీకి పాలమూరు వేదిక కానుంది. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 22 క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి స్టేడియంలు సిద్ధమవుతున్నాయి.
సాఫ్ట్‌బాల్‌లో తెలంగాణ సత్తా
జాతీయస్థాయిలో పతకాల పంట పండిస్తున్న తెలంగాణ సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకు ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక వేదిక అందుబాటులోకి వచ్చింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తొలిసారిగా సాఫ్ట్‌బాల్‌కు చోటుదక్కడం, ఈ పోటీలకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదిక కావడం విశేషం. సొంతగడ్డపై జరుగుతున్న ఈ పోటీలు వారికి మరింత గుర్తింపును తెచ్చిపెట్టనున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!