అవినీతి కేసులో సీఐ, ఎస్సై అరెస్ట్
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:14 AM
స్టేషన్ బెయిల్ కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేసి, మరో రూ.5 లక్షలు తీసుకుంటుండగా కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సీఐ ఆదేశాలతో ఎస్సై లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడగా, ఇద్దరి ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది.
స్టేషన్ బెయిలిచ్చేందుకు కీసర సీఐ 10 లక్షలు డిమాండ్..
ఇప్పటికే 3.35 లక్షలిచ్చిన నిందితుడు
మిగతా డబ్బు కోసం ఒత్తిళ్లు.. ఏసీబీకి ఫిర్యాదు
సీఐ ఆదేశాలతో రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఎస్సైని పట్టుకున్న ఏసీబీ అధికారులు
సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి అరెస్ట్
ఠాణా ముందు పటాకులు కాల్చిన బాధితులు
లక్ష లంచంతో పట్టుబడిన ట్రెజరీ అధికారులు
చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ వల
ఏటీవో, ఎస్‌టీవో సహా ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్, కీసర రూరల్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకుగాను భారీగా డబ్బులు డిమాండ్ చేసి, లంచం తీసుకుంటుండగా వారిని అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. రేషన్‌బియ్యం అక్రమ రవాణా కేసులో సయ్యద్ ఇర్షాద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ నెల 2న కీసర పోలీసులకు సూచించారు. ఈ క్రమంలో ఇర్షాద్‌ను సీఐ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
కేసు పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా ఉండేందుకు, స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని, రూ.5లక్షలు ఇస్తానని ఇర్షాద్ చెప్పటంతో అతడిపై పోలీసులు అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో ఇర్షాద్ అదే రోజు రూ.3.35 లక్షలు ముట్టజెప్పాడు. తర్వాత రోజుల్లో మిగతా డబ్బుల కోసం పోలీసులు అతడిపై ఒత్తిడి తెచ్చారు. ఈ వేధింపులు భరించలేక ఇర్షాద్.. ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు మరో రూ.5లక్షలు ఇచ్చేందుకు కీసరకు వెళ్లారు. సీఐ ఆంజనేయులు ఆదేశాల మేరకు.. వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కీసర సెక్టార్ ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డికి నాగారం డివిజన్ రాంపల్లిలోని పెద్దచెరువు వద్ద డబ్బులు ముట్టజెప్పాడు.
ఓ కారులో కూర్చొని డబ్బు తీసుకున్న జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులు తీసుకోవాల్సిందిగా ఆదేశించిన సీఐ ఆంజనేయులును కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లో హబ్సిగూడలోని సీఐ ఆంజనేయులు ఇంట్లో, బోడుప్పల్‌లోని ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆంజనేయులు ఇంట్లో రూ.5లక్షలు, జ్ఞానేందర్‌రెడ్డి ఇంట్లో రూ.10లక్షలు లభించినట్లు సమాచారం. వాటితో పాటు పలు దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం ఏసీబీ అధికారులు.. సీఐ, ఎస్‌ఐలను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.
కీసర పోలీస్ స్టేషన్ వద్ద సంబరాలు
ఏసీబీ అధికారులకు కీసర సీఐ, ఎస్సై పట్టుబడడంతో పోలీ్‌సస్టేషన్ వద్ద కొందరు స్థానికులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వారు మాట్లాడుతూ.. సీఐ ఆంజనేయులు విధుల్లో అరాచకంగా వ్యవహరించేవారని, డబ్బు కాంక్షతో, కక్షసాధింపులతో అక్రమంగా కేసులు బనాయించారని, తమను నానా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి అండతో సీఐ అనేక అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
చెక్‌పోస్ట్-పంజాగుట్ట ఎలివేటెడ్ కారిడార్!
ఆపరేషన్ పోలో.. ఒక అద్భుతం