చెక్‌పోస్ట్-పంజాగుట్ట ఎలివేటెడ్ కారిడార్!
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:03 AM
కేబీఆర్ పార్క్ చుట్టూ వంతెనలు, అండర్‌పాస్‌ల ప్రణాళికలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ వంతెనలు, అండర్‌పా్‌సలు రద్దు?
‘వన్ వే’తో ట్రాఫిక్ చిక్కులు పరిష్కారం
దాంతో ప్రాజెక్టును కుదించి ఎలివేటెడ్ కారిడార్.. సిగ్నల్లేకుండా సికింద్రాబాద్‌కు
సికింద్రాబాద్ నుంచి ఐటీ కారిడార్‌కు అంతే తేలిగ్గా ప్రయాణం
ఇరువైపులా 3 చొప్పున 6 లైన్లతో కారిడార్‌కేబీఆర్ చుట్టూ కొనసాగనున్న వన్ వే
ప్రభుత్వం ముందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనలు, అండర్ పాస్‌ల నిర్మాణ ప్రణాళిక మారింది. పార్క్ చుట్టూ ఏడు జంక్షన్లలో వంతెనలు, అండర్‌పా్‌సలను గతంలో ప్రతిపాదించారు. వాటి నిర్మాణానికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేసేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన వన్ వే విధానం విజయవంతం కావడంతో ఈ ప్రాంతంలో మొదటి నుంచీ ఉన్న ట్రాఫిక్ సమస్యలు చాలావరకు పరిష్కారం అయ్యాయి. మూల సమస్యే పరిష్కారం అయిన నేపథ్యంలో వంతెనలు, అండర్‌పా్‌సలు రద్దుచేసి, వాటి స్థానంలో పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
వన్ వే రాకముందు సిగ్నల్స్ ముందు నిమిషాల తరబడి వేచి చూడాల్సివచ్చేది. సిగ్నల్ పడ్డ తర్వాత కూడా నత్తనడక సాగేది. ప్రస్తుతం ఎక్కడా ఆగకుండా వాహనాల రాకపోకలు సాగిపోతున్నాయి. దీంతో రూ.వేల కోట్లు వెచ్చించి అన్ని ప్రాజెక్టులు నిర్మించడం అవసరమా? అన్న ఆలోచన అధికారుల్లో మొదలైంది. తక్కువ ఆస్తుల సేకరణ, నిర్మాణ వ్యయంతో కూడిన ప్రత్యామ్నాయ ప్రణాళికలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 నుంచి (చెక్‌పోస్ట్ ఆవల) పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వరకు ఇరు వైపులా ప్రయాణించే విధంగా ఆరు వరుసల వంతెనను ప్రతిపాదించారు.
పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు, అటు నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే వాహనాలు సిగ్నల్ చిక్కులు లేకుండా రాకపోకలు సాగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న కేబీఆర్ పార్క్ వన్‌వేను యథాతథంగా కొనసాగిస్తారు. పంజాగుట్ట నుంచి ఓఆర్‌ఆర్ వెళ్లాలి అనుకున్న వాహనాలు ఈ వంతెన ఎక్కకుండా నేరుగా కేబీఆర్ పార్క్ వరకు వచ్చి ఎడమ వైపు తిరిగి బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, మహారాజ్ అగ్రసేన్ జంక్షన్, రోడ్ నంబర్ 45 మీదుగా ఓఆర్‌ఆర్‌కు వెళతాయి. పంజాగుట్ట నుంచి చెక్‌పోస్ట్ వరకు నాలుగు కిలోమీటర్ల పొడవునా నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌కు రెండుచోట్ల అప్, డౌన్ ర్యాంపులు ఉండే అవకాశముంది.
వెయ్యి కోట్లు మిగిలించిన వన్‌వే
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటీవ్ ట్రాన్స్‌ఫర్మేటీవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ రూ.1090 కోట్లతో వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. రెండు ప్యాకేజీలుగా విభజించిన ప్రాజెక్టులకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గర, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర, మహరాజ్ అగ్రసేన్ జంక్షన్ వద్ద పనులు కూడా మొదలయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆగస్టు 18 నుంచి పార్కు చుట్టూ ‘వన్ వే’ రాకపోకలు అమలు చేస్తున్నారు. తొలుత ఒకటి, రెండు రోజులు ఇబ్బందికరంగా ఉన్నా ప్రస్తుతం వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వంతెనలు, అండర్‌పా్‌సలు అవసరం లేదని, వాటి స్థానంలో ఒకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే చాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఇది
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పంజాగుట్ట వెళ్లేటప్పుడు చెక్‌పోస్ట్ దాటాక నెక్సస్ షోరూమ్ తర్వాత అప్ ర్యాంప్ మొదలవుతుంది. మొజంజాహి కాలేజీ వద్ద డౌన్ ర్యాంప్ దగ్గర వాహనాలు దిగుతాయి. పంజాగుట్ట నుంచి చెక్‌పో్‌స్టకు వచ్చేటప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వద్ద ఎలివేటెడ్ కారిడార్ ఎక్కే అప్ ర్యాంప్ ఉంటుంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాటాక మెట్రో స్టేషన్ ముందు డౌన్ ర్యాంపు ఉంటుంది. అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి మెట్రో స్టేషన్ వరకు నేరుగా ఎలివేటెడ్ కారిడార్ మీద వచ్చి మాదాపూర్, ఐటీ కారిడార్‌కు వెళ్లిపోవచ్చు. అదే విధంగా ఐటీ కారిడార్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లవచ్చు. దీనికితోడు గతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన మరో ఎలివేటెడ్ కారిడార్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇది రోడ్డు నంబర్ 12 లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మొదలై ఏసీబీ కార్యాలయం, న్యాయ విహార్, దుర్గం చెరువు, టీ-హబ్ మీదుగా శిల్ప లేఅవుట్ వరకు వెళ్తుంది. శిల్పా లేఅవుట్‌లో ఇప్పటికే నిర్మించి ఉన్న వంతెన ద్వారా ఓఆర్‌ఆర్‌ను చేరుకోవచ్చు. అంటే ఓఆర్‌ఆర్‌ను చేరుకోవడానికి రోడ్ నంబర్ 12, రోడ్ నంబర్ 45 రెండు మార్గాలు ఉంటాయి.
ప్లాన్ మారింది భారం తగ్గింది
మొదటి ప్రణాళిక ప్రకారం పార్కు చుట్టూ 237 ఆస్తులు సేకరించాల్సి ఉంది. ఇందుకోసం రూ.1048 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ భూసేకరణ విభాగం అంచనా వేసింది. టీడీఆర్‌లు తీసుకునేందుకు యజమానులు ముందుకు రాకపోవడంతో చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా 36 మంది కోర్డుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తక్కువ ఆస్తుల సేకరణతో అయ్యే ఎలివేటెడ్ కారిడార్ ఉత్తమమని ఇంజనీరింగ్ విభాగం వర్గాలు తెలిపాయి.
రిటైనింగ్ వాల్ నిర్మించి
ప్రత్యామ్నాయ ప్రణాళికల నేపథ్యంలో ఇప్పటికే పనులు నిలిపివేశారు. అగ్రసేన్ జంక్షన్ వద్ద అండర్ పాస్ కోసం తవ్వారు. ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించి.. కింది వైపు పూర్తి స్థాయిలో రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. చెక్ పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు వంతెన నిర్మించనున్న నేపథ్యంలో ఆ మార్గంలో పనులు యధావిధిగా సాగనున్నాయి. గతంలో 400 నుంచి 500 మీటర్ల మేర నాలుగు లేన్ల వంతెనలు ప్రతిపాదించగా ఇప్పుడు 4 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన ఫౌండేషన్ల సామర్ధ్యం సరిపోయే అవకాశం లేదు. నూతన డిజైన్ ప్రకారం వాటిని పునర్నిర్మించే అవకాశముంది. కారిడార్ మీద ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
పది సెకన్లలో చంపేశాడు..!!
ఆపరేషన్ పోలో.. ఒక అద్భుతం